రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 2 వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 2
త్రిభుల (ఏకాంతంలో)
[సుల్తాన్ కనుమరుగవనిచ్చి, ప్రహారీ గోడ తలుపు నెమ్మదిగా తెరుస్తాడు. ఆదుర్దాతో నాలుగు దిక్కులూ పరిశీలించి, కప్పనుండి తాళం తొందరగా తీసి, లోపలికి వెళ్ళి మళ్ళీతాళం వేసుకుంటాడు. విచారవదనంతో అన్యమనస్కుడై అడుగులు వేస్తుంటాడు]
ఆ ముదుసలి నన్ను శపించాడు. అతను మాటలాడుతున్నప్పుడు కూడా నేను అతన్ని అనుకరించి అవహేళన చేశాను. పాపం శమించుగాక! నా పెదాలే నవ్వాయి. అతని విషాదం నా గుండెను తాకింది. నిజంగా శాపగ్రస్తుడే. (నాపరాయి పలక మీద కూర్చుంటాడు.)
పరిసరాలతో నా బాహ్యరూపం కుమ్మక్కై, నన్ను హృదయం లేనివాడిగా, కౄరుడిగా, పాషండుడిగా, చేస్తుంది.
బఫూన్! ఓరి భగవంతుడా! అనాకారిగా, అందరూ అసహ్యించుకునేట్టుగా, అవమానించేట్టుగా ఎందుకు సృష్టించేవయ్యా?
ఆ ఆలోచన పడుక్కున్నా, మేలుకున్నా, చివరకి కలల్లోకూడా వెంటాడుతోంది. మెలకువలో చిత్రవధ చేస్తోంది.
ఈ కౄరుడైన బఫూన్, దరిద్రపు దర్బారు విదూషకుడు- తల అమ్ముకున్న నేరానికి- నవ్వడం, నవ్వించడం మినహా ఇంకేదీ చెయ్యలేడు. చెయ్య కూడదు. సాహసించకూడదు.
ఎంత దౌర్భాగ్యం! ఏమిటీ బాధ!
ఆఖరికి కటిక దరిద్రుడైనా, నీచాతినీచుడైన బానిస అయినా, మరణదండన విధించబడి శృంఖలాబధ్ధుడైన నేరస్థుడైనా, వాడి బాధని కన్నీళ్లతో కడుక్కునే వీలుంటుంది. కానీ, నాకు అటువంటి అవకాశం లేదు. బాధాకరమైన బలహీనతలతో- నేలకు ఒదిగి ఉండడం కష్టం. అంతకు మించి నన్నుచుట్టు ముట్టి ఉన్న ఈ అందాలూ, అధికారాలూ, ఈ మగసిరులూ, తళతళలూ నన్నింకా విచారగ్రస్తుణ్ణిచేస్తున్నాయి. నా దౌర్భాగ్యం మగసిరినుండి దాగనూలేదు. నా హృదయం ఒంటరిగా విచారాన్ని వెలిగ్రక్కనూలేదు.
నా ప్రభువు- ఈ రాజ్యాధినేత- ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ ఉంటాడు. మృత్యుభీతి లేనివాడు, మగువలపొందు వదలని వాడు, రూపసి. వర్ఛస్సుగలవాడు. నేను దాగుంటే, నన్ను కాలితో అటూ, ఇటూ తంతూ, “ఏయ్ బఫూన్, కానీ, నాకు వినోదం కల్గించు” అంటాడు. పాపం బఫూన్! నేనూ మనిషినే. నామదిలో కూడా దహించే విద్వేషం, గర్వం, అణచుకోలేని కోపం, సలసల మరుగుతుంటాయి. నన్ను యమయాతనకు గురిచేస్తుంటాయి.
నేను ఎప్పుడూ ఏదో పన్నాగం పన్నాలి. నా ఆలోచనలు, వ్యక్తిత్వం, ఆవేశాలు, అన్నీ దాచుకుని మా యజమాని ఆజ్ఞ మేరకు అందరకూ వినోదం కలిగించవలసిందే. ఇంతకంటే కనికిష్టమైన దాస్యం మరొకటి ఉండదు. నేను కదలినప్పుడల్లా నా కాలికి వేసిన ఈ శృంఖలం నన్ను బాధిస్తుంటుంది. మగవాళ్ళందరిచే ఉపేక్షించబడి, ద్వేషించబడి, నేలకు త్రొక్కివేయబడ్డాను. స్త్రీలందరిచే కరవనికుక్కగా గుర్తింపు పొందాను.
వీరాధివీరులారా! దర్బారులోని సాహసవంతులారా! మిమ్మల్నినేనెంతగా ద్వేషిస్తున్నానో మీకు తెలియదు. ఇదే హెచ్చరిక! ఇక్కడ మీకొక శత్రువున్నాడు జాగ్రత్త! మీరు నాకు చేసిన ప్రతి అవహేళనకీ, ఏవగింపుకీ తగిన ప్రతిఫలం అందిస్తాను. మీ అహంభావపూరితమైన పాచికలు పారకుండా వాటికి ఆదిలోనే హంసపాదులు సృష్టించడమో, పురిట్లోనే సంధికొట్టేలా ప్రయత్నం చెయ్యడమో చేస్తాను. మీ యజమాని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ మీ ఆశా సౌధాలు కూలుస్తాను. మీ కాంక్షాపుష్పాలకు- రేకు వెంబడి రేకు – విడదీసి, అది పుష్పించకముందే, మొగ్గలోనే త్రుంచెస్తాను. మీరే నన్ను దుర్మార్గుడిగా మారుస్తున్నారు.
కానీ, ఛీ! ఇతరుల ఆనందక్షీరంలో విషపు చుక్కలు చిందించడానికి బ్రతికే బ్రతుకూ- ఒక బ్రతుకేనా!
ఒక సాత్త్విక భావం మదిలో మెదిలితే, దాన్ని బయటకు వెలిగ్రక్కకుండా, ఈ గంటల గలగలల మధ్య దాన్ని సమాధిచెయ్యవలసిందే కదా!
ఒక రక్కసిలా, అన్నీధ్వంసం చెయ్యాలనిపిస్తుంది. ఆటకోసం, మీ అందరి ఆనందం కోసం నా హృదయాన్ని దొలిచేస్తున్న విద్వేషాన్ని, ఒక శూన్యమైన, అబధ్ధపు చిరునవ్వునొకదాన్ని ముఖానికి పులుముకుని నడవవలసి వస్తుంది. ఇంతకన్న దారుణమైన, హేయమైన స్థితి ఇంకేముంటుంది?
(చపటా మీచి లేస్తాడు.)
లేదు. ఇక్కడ విషాద ఛాయలు లేవు. ఒక సారి ఈ గుమ్మందాటేనంటే, ఒక వింత ప్రపంచం ఆవిష్కృతమౌతుంది. ఈ ప్రపంచాన్ని ఇక్కడే మరిచిపోదాం. గతకాలపు వెతలు, ఎదురుచూస్తున్న ఆనందపు ఘడియల ఉత్సుకతను ఏమాత్రం తగ్గించలేవు.
(మళ్ళీ ఆలోచనలలోకి వెళ్ళిపోతాడు)
ఆ ముదుసలి నన్ను శపించాడు. ఈ ఆలోచనే మళ్ళీ మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతోంది?
అది రాబోయే విషాదానికి సంకేతమా? బాబోయ్ కొంపదీసి నాకు పిచ్చి గాని ఎత్తడంలేదు కద!
(అతను నెమ్మదిగా తలుపు తడతాడు. ధవళవస్త్రాలు ధరించిన ఒక చిన్నారి కన్నియ పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతులలో
వాలిపోతుంది
( సశేషం )
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి