రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం
(రంగస్థలి రెండు భాగాలుగా విడివడి “తెర వెనుక” జరిగే విషయాలన్నీ ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. )
ప్రథమాంకము దృశ్యం 5
(రాజు, త్రిభుల, కాశ్యప, వేలరీ, తదితరులు)
వేలరీ: నామాట వినవలసిందే! నన్ను వద్దని శాసించే వారెవ్వరు?
రాజు: ( తేరుకుని) ఓహ్! మీరా, వేలరీ!
వే: అవును, నేనే!
(రాజు కోపంతో అతని మీదకు వెళ్లబోతుండగా త్రిభుల అడ్డుకుంటాడు)
త్రి: ప్రభూ! అతనితో సంభాషించడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి.
(నాటక ఫక్కీలో నిల్చుని వేలరీతో)
స్వామీ! ఒకప్పుడు తమరే కదా, ఈ సింహాసనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసింది. అయినా ప్రభువులు తమకు సహజమైన ఔదార్యంతో కనికరించి క్షమా భిక్ష పెట్టారు. కాని ఇప్పుడు మిమ్మల్ని ఏ వెర్రి ఆవహించింది? (కాశ్యపను చూపిస్తూ) ఇంతవరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని మరుగుజ్జూ, కురూపీ, సంస్కార హీనుడూ, ముక్కుమీద బొడిపెలతో అందవికారంగా ఉన్న అటువంటి ఆకారంనుండా మనుమల్ని ఆశిస్తున్నారు? నా గూనిలాగే వంకరవాడు అతను. మీ కూతుర్ని అతని సరసను చూస్తే ఎవ్వరైనా నవ్వుకో వలసిందే!
ప్రభువులే కనుక ఆదుకోపోతే, మీకు (కాశ్యపను చూపిస్తూ) అతనికంటే అపూర్వమైన నమూనాలవంటి మనుమలు కలిగి ఉండేవారు. రోగిష్టులు, అనాకారులూ, కురూపులూ, అతనిలాగే పొట్ట ఉబ్బిపోయో…
(కాశ్యప ఆవేశంతో ఊగిపోతుంటాడు)
లేదా నాలాగ గూనితోనో. అబ్బ! ఎంత రోత!
ఇకపై ప్రభువులు మీరు గర్వ పడేటటువంటి మనుమల్ని ప్రసాదిస్తారు.
మీ కాళ్లమీద తారంగం, తారంగం, మీ బవిరిగడ్డంతో ఆటలూ…
(త్రిభులను అభినందిస్తూ అందరూ చప్పట్లు కొడతారు)
వేలరీ: ఇంతవరకూ జరిగిన అవమానాలు చాలక మరొకటన్నమాట!
ప్రభూ! నామాట వినాలి! పాలితులు నివేదన చేస్తున్నప్పుడు చెవి ఒగ్గి వినడం పాలకుల ధర్మం. నిజమే! మీ సార్వభౌమత్వం నన్ను వధ్యశిలకు తీసుకువెళితే, అక్కడ మీ క్షమా భిక్ష నన్ను కలలా కమ్మేసింది. అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాను కూడా… ప్రభువుల క్షమ మృత్యువుకన్న పదునైనదన్న సత్యం గ్రహించుకోలేక. ఒక తండ్రిని రక్షించుకుందికి అతని తనయ తన శీలాన్ని బలిచేసుకుంది. ఔను! తరతరాలుగా మచ్చ ఎరుగని ఈ పాటియర్ వంశంపై- కనీసం అభిమానం గాని, గౌరవంగాని, జాలిగాని, విచారంగాని లేని నువ్వు, ఓ ఫ్రాన్సిస్, ఆ రాత్రి ఏం చేశావ్? నీ పానుపునే ఆమె శీలానికి సమాధిని చేశావు. నాకూతురు కోరుకున్నది భయం అంటే ఎరుగని , వేలెత్తి నేరం చూపించలేని (కాశ్యపను చూపిస్తూ) బయ్యార్డ్ లాంటి వ్యక్తిని. నువ్వు మాయమాటలతో, అనురాగపు నటనలతో అమాయకురాలైన ఆమెను మోసపుచ్చావు. తండ్రి ప్రాణాలను రక్షించుకుందికి తపన పడిన ఆమెకు – హృదయంలేని రాజువి దొరికావు— కోరికను అనుగ్రహిస్తూ. తండ్రి ప్రాణాలకు ఒక నిర్దాక్షిణ్యమైన బేరం పెట్టావు. అదిఘోరమైన వ్యాపార సరళి. ఒక పెద్ద తప్పు చేసావు.
ఈ దేశంలోని మహామహుల్లో ప్రవహిస్తున్నట్టే- నా శరీరంలో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బొట్టూ నీదే! కాదనను. ఈ బవిరిగడ్డాన్ని క్షమిస్తున్నట్టు నటించి, శోకతప్తయైన ఒక స్త్రీ శీలాన్ని నిర్దాక్షిణ్యంగా కాలితో తొక్కేసేవే! అది చాలా హేయమైన పని. తండ్రి నీ సేవకుడు. కాని, కుమార్తె కాదే! రారాజుల అధికార పరిధిని నువ్వు అతిక్రమించావు. అయినా క్షమించావన్న కీర్తి నీకు. తిరుగుబాటు చేసానన్న అపప్రథ నాకు. నీవేగనుక నా మందిరం దరిదాపులకు వచ్చి ఉంటే, మోకాళ్ళపై ప్రణమిల్లి మరీ మృత్యువునే కోరుకునే వాణ్ణి. నా కుమార్తెకూ- నా జాతికీ- నా కీర్తికీ- క్షమ అంటే– ఛీ! ఒకసారి పంకిలమైన జాతి నాజాతి అనిపించుకోదు. అవమానంతో సమానం. నాకూ వాటికీ- ఋణం తీరిపోయింది.
నేనిపుడు ఆమెను నీదగ్గరనుండి తీసుకుపోడానికి రాలేదు. నీ దగ్గరే ఉండనీ. కళంకముద్రితమైన ఏ వస్తువునూ నీ దగ్గరనుండి తీసుకుపోను. నీ ఆనందోత్సవాల మధ్య- ఏదో ఒకరోజు ఇది జరిగి తీరుతుంది. ఏ తండ్రిదో- సోదరిడిదో- ఏ అభాగ్యుడైన భర్తదో- హస్తం నీ వంశాంకురాన్ని, నీ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుందో- అప్పటిదాకా నీతోనే ఉండనీ. నా విషణ్ణవదనం నిన్ను వెంటాడుతూ, నువ్వు చేసిన ఈ నీచకార్యాన్ని నీకు పదే పదే గుర్తుచేస్తుండాలి. అది విని, న్యూనతాభావంతో, నీ అహంకారం నాముందు తల వాల్చాలి. ఇక నువ్వు నీ సేవకులకు నా శిరస్సు ఛేదించమని ఆజ్ఞ జారీ చెయ్యి.
చెయ్యగలవా? చెయ్యలేవు. ఎందుకంటే, అప్పుడు నా ఆత్మ తిరిగి వచ్చి నీకు హెచ్చరిక….
రా: ఉట్ఠి పిచ్చి ప్రేలాపన! (పెన్నతో) ఈ దేశద్రోహిని బందీ చెయ్యండి!
త్రి: (వెలరీని వెక్కిరిస్తూ) పాపం! అమాయకుడు! ఏదో వాగుతున్నాడు.
వేలరీ: ఎలాగూ చనిపోతున్న సింహం కోసం ఒక విశ్వాసం గల కుక్కను బలిచేసుకోవడం తెలివి తక్కువ దనం. (త్రిభులవైపు తిరిగి) నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎవరయితేనేం! నీకు నా కన్నీళ్ళు ఒక ఆటగా, ఒక వ్యావృత్తిగా మారింది. హేయమైన అపహాస్యాలూ- విషసర్పం కంటే పదునైన కోరలూ ఉపయోగిస్తున్నావు. ఇదే నాశాపం!
(రాజు తో) నీ మకుటంలో ఈ దేశంలోని అపురూపమైన మణులు పొదిగి ఉన్నాయి. నానుదుట ముదిమి, శిరస్సు మీద పలిత కేశాలూ ఉన్నాయి. అయినా చెరొక కిరీటాన్నీ ధరించి, ఇద్దరమూ రాజులమే. ఒకవేళ ఒక అపవిత్ర హస్తం నీకు అపచారం చేసినా, అవమానం చేసినా, నీ భుజబలంతోనే దానికి ప్రతీకారం తీర్చుకో యత్నింతువుగాక! నాకు జరిగిన అవమానాలకు భగవంతుడే ప్రతీకారం చేస్తాడు
(వేలరీని భటులు ఈడ్చుకుని వెళ్ళిపోతారు)
(ప్రథమాంకం సమాప్తం)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి