రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 4 వ భాగం
ప్రథమాంకము దృశ్యం 4
[ఫ్రాన్సిస్, త్రిభుల ప్రవేశం)
త్రి: రాజసభకు మేధావులా? ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదు.
ఫ్రా: అయితే పోయి చెప్పుకో. మా సోదరి సలహా మండలిని మేధావులతో నింపాలని యోచిస్తున్నది.
త్రి: ఇది మనలో మన మాట. నేను మీ కంటే తక్కువ తాగేనని ఒప్పుకుంటారు గదా. కాబట్టి మనిద్దరిలో నాకు ఈ విషయం అన్ని కోణాలూ, రూపాలూ, వర్ణాలూ చర్చించి, నిర్ణయించే అధికారం ఉంది. నాకు ఒక ఆధిక్యత ఉంది. అట్టే మాటాడితే రెండు ఉన్నాయి. మొదటిది నేను తక్కువ తాగడం. రెండోది– నేను రాజుని కాకపోవటం. మీ సలహా సంఘంలో మేధావుల్ని రమ్మనమనే కంటే, కరువునూ, మహమ్మారినీ పిలుచుకు రండి.
ఫ్రా: మరి మా సోదరి సలహామండలిని మేధావులతో నింపడానికే నిర్ణయించుకున్నదే!
త్రి: అది ఒక సోదరికి కూడని పని. నన్ను నమ్మండి ప్రభూ! ఈ విశాల జంతు ప్రపంచంలో మేధావిగా చలామణీ అయ్యే వ్యక్తి కంటే హీనమైనదీ, నికృష్టమైనదీ, ఎక్కడా కనిపించదు. ఒక జిత్తులమారి తోడేలు గాని, నక్క, కాకి, కుక్క, అన్నార్తుడైన కవి, విశ్వాసఘాతకుడు, గుడ్లగూబ, ఎలుగుబంటి, సోమరిపోతు ఎవరైనా, వాడిలో సగానికి కూడా సాటిరావంటే నమ్మండి. మీకు సుఖంలేదా? దండయాత్రలు లేవా? సర్వం సహాధికారం లేదా? అన్నిటినీ మించి కాంతులీనుతూ, సుగంధపరిమళాలు వెదజల్లే మనోహారిణులైన సుందరీ మణులకు కొదవా?
ఫ్రా: ఒకరోజు రాత్రి మార్గరెట్ నా చెవిలో— స్త్రీల చెలిమి నన్ను కలకాలం కట్టిపడేయలేదని చెప్పింది. ఏదో ఒకరోజు విరక్తి కలుగుతుందట.
త్రి: చిత్రమైన చికిత్సే. విరక్తహృదయాలకు మేధోల్లసనం! వాహ్! ప్రభూ! ఆమె ఎప్పుడూ విపరీత మైన చికిత్స చేస్తానంటే, మీరు నమ్ముతారనుకుంటా.
ఫ్రా: అయితే నాకు మేధావులక్కరలేదు. ఐదుగురో, ఆరుగురో కవులు చాలు.
త్రి: నేనే రాజునయితే, పాపాత్ముల్ని పవిత్రుల్ని చేసే గంగాజలాన్ని యమభటులు ద్వేషించిన దానికంటే కూడా ఎక్కువగా కవుల్ని ద్వేషిస్తాను.
ఫ్రా: కేవలం ఐదుగురో, ఆరుగురో…
త్రి: అబ్బో, అదే చాలు. ఒక గుర్రాలశాల పెట్టు. నిజానికి ఒక జంతుప్రదర్శన శాలే! మనం ఇప్పటికే మరువీచి ప్రతాపం చూస్తున్నాం…వాడి అంత్యానుప్రాసలు భరించలేక చస్తున్నాం.
(తెర వెనుక నుండి)
మరువీచిక: కృతజ్ఞుణ్ణి.
(తనలో) ఈ మూర్ఖుడు నోరు మూసుకోగలిగి ఉంటే వాడంత తెలివైనవాడు మరొకడుండకపోను.
(తెర ముందు)
త్రి: ప్రభూ అందాన్నే మీ స్వర్గంగా కొనసాగనియ్యండి. ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతం చెయ్యగలిగేది సూర్యుడే. ఈ పుస్తకాలతో మీ బుర్ర పాడుచేసుకోకండి.
ఫ్రా: లేదు. లేదు. నిజానికి ఆపిల్సు ఆంటే చేపలకు ఎంత ఇష్టమో, నాకు పుస్తకాలంటే అంతే.
(ఇంతలో తెరవెనుక నుండి నవ్వులు వినిపిస్తాయి)
త్రిభులా! వాళ్ళు నీ గురించే చెప్పుకుని నవ్వుకుంటున్నట్లున్నారు.
(ఆ దిశగా వెళ్ళి- వాళ్ళ మాటలు చెవి ఒగ్గి విని, వెనుదిరుగుతాడు)
వాళ్ళు ఇంకో మూర్ఖుడి గురించి మాటాడుకుని నవ్వుకుంటున్నారు.
ఫ్రా: ఎవరు?
త్రి: ఇంకెవరు? ప్రభువులే!
ఫ్రా: వాళ్ళేమంటున్నారు?
త్రి: వాళ్ళు మిమ్మల్ని పిసినారి అంటున్నారు. సంపదలు రాజ్యాన్ని విడిచిపోతున్నా, తమ చేతులకు ఏమీ అంటటం లేదని వాపోతున్నారు.
ఫ్రా: వాళ్ళను ఇక్కడనుండే పోల్చుకోగలను… మధునిష, బహుగుణ, మాతంగ. అవునా?
త్రి: అవును.
ఫ్రా: కృతఘ్నులు. విశ్వాసం లేని కుక్కలు. అందులో ఒకడిని జలసేనాధ్యక్షుడ్ని చేసాను. ఒకర్ని దేశానికే అత్యున్నతపోలీసు జనరల్ ని చేశాను. మాతంగ ను మా ఇంటికే “మాస్టర్”ని చేశాను. అయినా ఇంకా గునుస్తున్నారు.
త్రి: అవి చాలవు. వాళ్లకు మీరు తక్షణం చెయ్యవలసింది ఇంకొకటి ఉంది. అది తక్షణమే చేసెయ్యండి.
ఫ్రా: ఏమిటది?
త్రి: ఉరి తీయించడమే!
(తెర వెనుక నుండి అదే సమయంలో)
ఫెన్న: (త్రిభుల వైపు చెయ్యి చూపిస్తూ, మాట్లాడుతున్న ముగ్గురితో) విన్నారా వాడి మాటలు?
బహు: ఆహా!
మధు: వాడు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాడు.
(తెర ముందు)
త్రి: (రాజుతో) బాధామయమైన శూన్యం మీ హృదిని వేదిస్తూ ఉండి ఉంటుంది. అందులోనూ. ఇంతమంది అందగత్తెలలో, ఏ ఒక్కరి కనులూ మిమ్మల్ని నిరాకరించలేకపోయినా, ఒక్క మనసైనా మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలిస్తే…
ఫ్రా: ఆ విషయం నీకెలా తెలుసు?
త్రి: ప్రభూ! అమాయకత్వం మొగ్గ విడుతున్నప్పుడు కలిగేదే నిజమైన ప్రేమ. ఆ స్థితి దాటిన తర్వాత చూపించే ప్రేమ – ప్రేమ కాదు.
ఫ్రా: అంటే, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీని వెదుక్కో లేకపోయేననేనా నీ అభిప్రాయం?
త్రి: తమ హోదా తెలియనిది ఎవరికి గనుక?
ఫ్రా: (తల పంకిస్తూ) అవును. ఎవరికి తెలియదు గనుక. (తనలో) అలా అయితే- బుస్సీ భవనంలో నా చిన్నారి ప్రేయసి విషయం చెప్పను.
త్రి: (ఏదో విషయం ఉందని పసి గట్టి) ఒక సామాన్య స్త్రీ?
ఫ్రా: ఏం? కాకూడదా?
త్రి: (ఆందోళనతో) అయితే బహుపరాక్! మీప్రేమ ఊహించరాని ప్రమాదాల మధ్య ప్రయాణం చేస్తోంది. ఈ ప్రజలకి కోపం వస్తే, రోమన్ల వలె వెర్రెక్కిపోతారు. ప్రాణాలు తాకట్టుపెట్టయినా తమ వస్తువుల్ని విడిపించుకుంటారు. తమబోటి ప్రభువులు, నాబోటి బంట్లు, మన స్నేహితుల అందమైన భార్యలతోనూ, చెల్లెళ్లతోనూ సంతృప్తిచెందవలసిందే!
ఫ్రా: నా ఉద్దేశ్యంలో కాశ్యప భార్య నాకు బాగా నప్పుతుందనుకుంటాను.
త్రి: అలాగయితే ఆమెను వరించండి.
ఫ్రా: చెప్పడం సులువు. చెయ్యడమే కష్టం.
త్రి: ఈ రాత్రికే ఆమెను కిద్నాప్ చేద్దాం.
ఫ్రా: ఈర్ష్యాళువైన ఆమె భర్త?
త్రి: ఏదో మిష మీద వాడిని జైలుకి పంపించెయ్యండి.
ఫ్రా: ఓహ్! లాభం లేదు.
త్రి: పోనీ నష్టం భర్తీ చెయ్య డానికి – అతనికి ఒక పదవి పారేయండి.
ఫ్రా: అలా అయినప్పటికీ, అసూయతో ఎదురు తిరిగి- ఇంటికప్పులెక్కి మరీ అరుస్తాడేమో?
త్రి: హు! ఈ మనిషితో కొన్నా కష్టమే! కసిరినా కష్టమే!
(త్రిభుల మాట్లాడుతుండగా కాశ్యప వచ్చి మిగతా సంభాషణ అంతా చాటుగా వింటాడు)
అయితే దానికి ఒక చిన్న సులభమైనదీ, సూక్ష్మమైనదీ ఒక ఉపాయం ఉంది. దాన్ని ముందే ఎందుకు ఊహించలేకపోయానా అని నాకే ఆశ్చర్యం వేస్తోంది. వాడికి శిరఛ్చేదం చేయించండి.
(కాశ్యప ఒక్క సారి గతుక్కు మని , వెనక్కి ఒక అడుగు వేస్తాడు.)
అతడ్ని ఏదో ఒక నేరంలో ఇరికించండి. శత్రువులకు సాయం చేస్తున్నాడని ఏదో కుట్రలో భాగస్వామిగా చూపించండి.
కాశ్యప: (ముందుకు వచ్చి వింటాడు) కార్చిచు వెధవ!
ఫ్రా: (త్రిభులతో) లాభం లేదు. ఆ తల అలా తియ్యడం వీలవదు. ఇంకేదైనా ఆలోచించు.
త్రి: ఏమిటీ! ఒక రాజ్యాధినేత అయి ఉండి, అంతలోనే మనసు మార్చుకోవడమా? ఇంత చిన్న విషయం చెయ్యలేని పనా?
(ముందుకు వచ్చి )
కాశ్యప: (త్రిభులతో) నీకు కొరడా వేయిస్తాను.
త్రి: నువ్వంటే నేనేం భయ పడను. ఈ చుట్టూ ఉన్న వాళ్లందరితోనూ వాగ్యుధ్ధం చెయ్యగలను. నాతల మీద ఈ కుచ్చు టోపీ ఉన్నంతకాలం దేనికీ భయపడను. నా గూని వెనక్కి బదులు ముందుకివచ్చి నీలాగ అయిపోతే మాత్రం, నేను అసహ్యంగా కనిపిస్తానని భయపడతాను.
కాశ్యప: (పట్టరాని కోపంతో కత్తి దూస్తూ) సభ్యత తెలియని బానిస!
ఫ్రా: శాంతించండి! స్వామీ! శాంతించండి. నాతో రా!
(ఫ్రాన్సిస్, త్రిభులను తీసుకు పోయిన తర్వాత తెర వెనుక నుండి అందరూ ముందుకి వస్తారు)
బహు: ప్రతీకారం! త్రిభులపై పగ తీర్చుకోవాలి.
మరు: లాభంలేదు. అతనికి రక్షణ కవచం చాల బలంగా ఉంది. ఎలా దెబ్బ తీస్తాం? అసలెక్కడ దెబ్బ కొట్టగలం?
పెన్న: ఆ పథకం నా దగ్గర ఉంది… మనందరికీ జరిగిన అన్ని అవమానాలకీ ప్రతీకారం తీర్చుకునే ఉపాయం. చీకటి పడగానే అందరూ సాయుధులై నన్ను కలవండి. … బుస్సీ భవనపు వెలుపలి గోడ దగ్గర…కాశ్యప ఇంటి గేటు సమీపంలో. ఇంకేవివరాలూ నన్ను అడగవద్దు.
మరు: నీ పాచిక నేనూహించగలను.
పెన్న: నిశ్శబ్దం. అతను వస్తున్నాడు.
త్రి: (తనలో) ఇప్పుడు ఎవరిని మస్కా కొట్టాలి? రాజుగారినా? అబ్బో! అదే జరిగితే భలే మజాగా ఉంటుంది.
(ఇంతలో ఒక రాజసేవకుడు వచ్చి త్రిభుల చెవిలో ఏదో చెబుతాడు)
సేవకుడు:(ప్రకాశముగా) శ్రీ వేలరీ, విషాదంలో మునిగి ఉన్న ఒక పండు ముదుసలి. ప్రభువుల దర్శనార్థం వేచి ఉన్నారు.
త్రి: (తనలో) ఈ పిశాచమా! (ప్రకాశముగా) ఓ! తప్పకుండా! శ్రీ వేలరీ గారిని దర్శించడానికి ఉత్సుకతగా ఉందని చెప్పు. (సేవకుడు నిష్క్రమించును)
(తనలో) అద్భుతం! ఈ జోకు ముందు మిగతావన్నీ దిగదుడుపే!
(ద్వారం దగ్గర ఏదో గందరగోళం, కలకలం వినిపిస్తుంది)
(బయటనుండి ఒక గొంతు): ప్రభువులను దర్శించాలి!
ఫ్రా: (స్త్రీలతో సరస సల్లాపాల మధ్య) ఎవరది లోనికి రావడానికి సాహసిస్తున్నది?
(బయటనుండి ఒక గొంతు): ప్రభువులను దర్శించాలి!
ఫ్రా: వీలు పడదు. వీలు పడదు.
ఇంతలో ఒక పండు ముదుసలి – బవిరిగడ్డం -నెరసిన జుత్తుతో స్టేజి వెనుకనుండి అందర్నీ తోసుకుంటూ ముందుకి వచ్చి – రాజు ఎదురుగా నిలిచి- కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు.
(సశేషం)
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి