రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 3 వ భాగం

ప్రథమాంకం  దృశ్యం 3

(ముందుగా గద్దే, పార్థివన్, విస్సు, మరువీచి ప్రవేశిస్తారు.  తర్వాత నెమ్మదిగా పెన్న, కాశ్యప ప్రవేసిస్తారు. ఒకరికొకరు అభివాదం చేసుకుంటారు)

పెన్న: ఉదాత్త మిత్రవర్యులారా!మీకొక కొత్త విషయం చెప్పబోతున్నాను. లేదు. ముందుగా మీ మేధాశక్తికి పరీక్ష. మీకొక చిక్కు ప్రశ్న. మీరే ఊహించండి. అనూహ్యమూ,   అద్భుతమూ, ఐన ఒక ప్రేమ కథ.   తల్చుకుంటే నవ్వొస్తుంది. జరగడానికి అవకాశంలేనిది….

గద్దే: ( కుతూహలం ఆపుకోలేక) ఏమిటది?

మరువీచి: తమకేమి కావాలో?

పెన్న: మరువీచీ! నే చెబుతున్నా విను.  నిన్నుపోలిన పరమ మూర్ఖుడు ఇంకొకడు ఉండడు.

మరు: పరమ మూర్ఖుడనా?  నాగురించి నేనెప్పుడూ అంతకంటే భిన్నంగా ఊహించటంలేదే!

పెన్న: కాకపోతే మరేమిటి?  నీ సరికొత్త కవితలో  త్రిభుల గురించి ఏమని రాసావు?  హేళనకు ఎంపిక చేసిన ఏకైక వ్యక్తి– అతణ్ణి “మూడుపదుల వయసులో- సంజవెలుగును బోలిన సంసార వంతుడ”ని చెప్పలేదూ?  అతడు కాదు. నువ్వే మూర్ఖుడివి.

మరు: నీతో నేను భేటీ వేసుకుంటే, మరుడు నన్నేమరు గాక!

పెన్న: ఓ గద్దే! విను.  పార్థివన్ గారూ, మీరు కూడా.  మిమ్మల్ని  ఊహించమని ప్రార్థిస్తున్నాను.  త్రిభులకు ఏదో ఒక వింత సంఘటన జరిగింది. అది ఏమిటి?

పా: అతని గూనిగాని పోయిందా?

కాశ్యప: కొంపదీసి ఈ నగరానికి అతణ్ణి పోలీసు కమిషనర్ గా వెయ్యలేదు కద!

మరు: ఒకవేళ తనే వండి ప్రభువులకు వడ్డించాడేమో!

పెన్న: (నవ్వుతూ) అంతకంటే నవ్వు తెప్పించేది. అతనికి … ఒక… (నవ్వుతో వగరుస్తూ)  మీరు ఊహించలేరు. అసలు నమ్మశక్యం కానిది.

పా: అతనిప్పుడున్న దానికంటే అనాకారి, కురూపిగా  మారిపోయాడేమో!

మరు: దాహంతో పిడచగట్టుకుపోయే అతని జేబు ఇప్పుడు బంగారు నాణేలతో గాని నిండిపోలేదు కద!
కాశ్య: కేకులు చెయ్యడానికి పంపలేదుకద!

మరు: స్వర్గంలో దేవుని సేవకు నియమించలేదు గద!

గద్దే: బహుశా ఏదైనా ప్రాణి ….

పెన్న: లాభం లేదు. మీరు లక్ష్యాన్ని ఛేదించలేరు. ఒక బఫ్ఫూన్…  త్రిభుల …కురూపి… అనాగరికుడు… వాడికి… వాడికి…  ఏమిటి ఉందో ఊహించండి… అమానుషం!  ఊహించండి!

మరు: వాడి గూని…

పెన్న: అబ్బే! ఇక లాభంలేదు.  వినండి… వాడికున్నది…. ఒక … ప్రియురాలు…
(అందరూ పగలబడి నవ్వుతారు)

మరు: సంస్థానాధీసుల తెలివి— లక్ష్యాన్ని  దాటిమరీ దూసుకుపోతోంది.

గద్దే: ఇది చాలా చచ్చు జోకు.

పెన్న: హాస్యం కాదు. నిజంగానే. నామీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. కావాలంటే మిమ్మల్నందర్నీ అతని ప్రియురాలి ఇంటిద్వారం వరకు తీసుకు వెళ్ళగలను.  ప్రతి రోజూ– నల్లటి ముసుగులో– వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు– ఆకలిగొన్న కవిలా –  ప్రవేసిస్తాడు.  నాకైనా ఒక రోజు చాలా కాకతాళీయంగా- కాశ్యప ఇంటిముందు బెదురు చూపులు చూస్తూ కనిపించాడు.  ఇక ఈ విషయాన్ని మీలోనే దాచుకొండి.  వాడి పని పట్టడానికి నా దగ్గర ఒక పథకం ఉంది.

మరు: అయితే ఒక చిన్న గీతిక…
త్రిభుల ఇక మన్మధుడిగా మారిపోయాడు
కాని, ఫర్వాలేదు. నాకింకా ధైర్యంగానే ఉంది.
ఇక ఏ శత్రు రాజు దేశం మీదకి దండెత్తినా
ఆయుధాలు దేనికి?  త్రిభులప్రేయసి ముఖం చాలదూ
వాళ్ళు తోకముడిచి పారడానికి?
(అందరూ నవ్వుతారు. ఇంతలో విస్సు ముందుకి వస్తాడు. పెన్న తన పెదాలపై వేలుంచి నిశ్శబ్దం సూచిస్తాడు.)

పెన్న: దొరలందరికీ విన్నపం.  నిశ్శ బ్దం పాటించండి.

పార్థి:  ఏదో ప్రేమలో పడ్డ వ్యక్తిలా – ప్రభువులు ఎందుకు రోజూ రాత్రిపూట  ఒంటరిగా సంచారం  చేస్తుంటారు?

పెన్న: (విస్సు నుద్దేశిస్తూ) ఆ విషయం విస్సు మనకి విశ్దం చేస్తారు.

విస్సు:        నిలకడలేని అతని మనసు- ఇపుడు ఎవరూ గుర్తించలేని విధంగా
ఆహార్యం మార్చుకుని తిరగాలని- మారువేషాలవైపు మరలింది.
ఒకవేల చీకటి ముదిరి- గవాక్షాన్ని ద్వారంగా భ్రమపడితే?
అయినా — పెళ్ళికాని వాడిని– అది నాకు సంబంధించని విషయం.

కాశ్య:       ఇక ఎవరికైనా – పెళ్ళాం లేదు- చెల్లీ లేదు- పిల్లా లేదు-
రాజుగారు అనుభవించాలనుకుంటే-  సుఖాన్నిఇతరులనుండి దోచుకుంటారు
అతని సుఖంకోసం- ఇవతలి వాళ్ళు వెతలపాలవుతారు.
ఆ నవ్వే నోటిలో ఉన్నవి- దంతాలు కాదు- సూటిగా నాటుకునే కోరలు

విస్సు: (పెన్న, మరువీచిలతో)  అతను రాజుగారి పేరు చెబితే చాలు- ఊగిపోతాడు.

పెన్న: (తనలో) అతని సొగసులాడి భార్యకు మాత్రం – ఇంత పిసరు భయం లేదు.

మరు: (తనలో) అదే కదా- అతన్ని భయానికి గురిచేసే విషయం.

గద్దే: (ప్రకాశంగా)  మీరు పొరపడ్డారు కాశ్యప!  రాజుగారిని చలాకీగా హుషారు ఉంచవలసిన బాధ్యతా, ఉదాత్తుడిగా తీర్చిదిద్దవలసిన బాధ్యతా- రాజపరివారానిదే!

పెన్న: సత్యం! విషాదంలో మునిగిపోయిన ప్రభువూ, తోకముడిచిన వసంతం, లేదా- శోక శైశిరం ఒకటేనని నా అభిప్రాయం.

(వీరు ఇలా మాట్లాడుకుంటుండగా దృశ్యం మారుతుంది. )

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: