రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 2 వ భాగం

ప్రథమాంకము — దృశ్యం 2

[ఫ్రాన్సిస్, త్రిభుల, గద్దే, ఇతర ప్రముఖులు ప్రవేశం. అందరూ చక్కని ఆహార్యంలో  ఉంటారు. త్రిభుల మాత్రం విదూషకుడి వేషధారణలో. ఫ్రాన్సిస్ అక్కడున్న స్త్రీలను మెచ్చుకోడానికి వెళుతుంటాడు.]

లాతూరు: శ్రీమతి ఇందిర ఈరోజు దేవకాంతల్ని సైతం మైమరపిస్తోంది.
గద్దే: నాకు అర్బుద, వినీల జంట నక్షత్రాల్లా కనిపిస్తున్నారు.
ఫ్రాన్సిస్: కానీ, శ్రీమతి కాశ్యప  ముగ్గుర్నీ తలదన్నేట్టుగా ఉంది.
గ: (శ్రీ కాశ్యపను చూపిస్తూ- అతను ఫ్రాన్సులోని నలుగురు మహాకాయులలో ఒకడని గుర్తుచేస్తూ) కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఆమె భర్త వినగలడు.
ఫ్రా: ఆ మాటకొస్తే నేనెవర్నీ లక్ష్యపెట్టను.
గ: అతనావిషయం పోయి డయానా సుందరికి చెబుతేనో?
ఫ్ర:  చెప్పనీ.  చెబితే నాకేం? (రాజు వేదిక చివరనున్న స్త్రీలతో సంభాషించదానికి వెళ్తుంటాడు.)
త్రిభుల: (గద్దేతో) రాజుగారు డయానాకు కోపం తెప్పిస్తారు.  ఎనిమిది రోజులయింది, రాజుగారు ఆ సుందరితో మాట్లాడి.

గ: రాజుగారు అలాగయితే ఆమెను ఆమె భర్త దగ్గరికి పంపేస్తారంటావా?
త్రి: నిజానికి, అలాజరగదని నేను భావిస్తున్నాను.
గ: ఆమె తన తండ్రి జీవితానికి ప్రతిగా — చాలా  పెద్ద మూల్యమే చెల్లించింది.

త్రి: వేలరీ చాలా చిత్రమైన మనిషి.  లేకుంటే, తనకూతుర్ని, కాదు కాదు, ఒక కాంతిపుంజాన్ని, ఈ లోకాన్ని అనుగ్రహించడానికి సాక్షాత్తూ స్వర్గం నుండి దిగివచ్చిన  దేవకన్య లాంటి డయానాని- కేవలం సేవకమాత్రుడైన ఒక గూని వాడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడా?

గ: అతను ఒక మతిలేని ముదుసలి. పాలిపోయి ముడతలు బారిన శరీరం అతనిది.  ప్రభువులు క్షమాభిక్షపెట్టినపుడు,  నేను మీకున్నంత దగ్గరగా ఉన్నాను.  “రాజును ప్రభువు క్షమించుగాక!” అని మాత్రమే అన్నాడు.  ఇపుడు, ఆ మాత్రం మతిస్థిమితం కూడా లేదు. పూర్తిగా పిచ్చివాడయిపోయాడు.

(రాజు ఆ సమయంలో శ్రీమతి కాశ్యపతో ముచ్చటిస్తూ  వెళుతుంటాడు)

రా: ఇంతలోనే దేవిగారికి ఈ దీనుడిపై  అంత కినుకా?

శ్రీమతి కాశ్యప: మావారు నన్ను విదేశాలకు తీసుకు వెళుతున్నారు.

రా:    అది మహా పాపం! ఈ రాజ్యం నీ పోకను నిషేధిస్తున్నాది. నువ్వు ఇక్కడనుండి కదలడానికి వీలులేదు.  నీ లేమి, ఈ సామ్రాజ్యంలో  సభాసదుల్నీ, వాళ్ళమేధస్సునీ, అపురూపంగా దాచుకున్న కోరికల్నీ నీరుగార్చెస్తుందే! ఇక్కడ కవులూ, శార్గ్జ్ఙపాణులూ, నిత్యమూ నీకోసమే తమ తమ ఆలోచనలనూ, ఆయుధాలనూ, ఉదాత్తంగా, పదునుగా ఉంచుకుంటారే!ప్రతిహృదయాన్నీ  దోచుకోగల నీ చూపుల తూపులు, ప్రతి సుందరినీ తన ప్రియుడ్ని జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరిక చేస్తాయే! ఈ సభా మంటపాన్ని  దివ్యమణులకంటే  కాంతిమతంచేసే సుందరీ! నీ ముఖారవిందం కనుమరుగైతే దినంలో దివం ఏదీ? ఈ రాజునీ, మంత్రిపుంగవుల్నీ, రాయబారుల్నీ, రాకుమారుల్నీ ఇంతమంది రాజ్యాధికారుల్నీ  త్రోసిరాజని ఓ రాజ్య రత్నమా! ఎక్కడో ఒక అనామక దేశంలో, ఒక కుగ్రామంలో, వెలుగులీనడానికి నీ మనసు ఎలా సమ్మతించింది?

శ్రీమతి కాశ్యప: కాసేపు మీ వర్ణనలు తగ్గించరాదూ…

రా: ఒకానొక దుష్ట శక్తి తన  హస్తంతో ఆనందోత్సవాల కేరింతలతో నడయాడే నాట్యకేళీమటపంలోని షాండిలియర్స్ ని మంచి రసవద్ఘట్టంలో త్రెంపివేసినట్టు….

శ్రీ.కా.: అడుగో… అప్పుడే… అనుమానం మొగుడు.

(అని వారి వద్దకు రాబోతున్న తన భర్త రాకను సంజ్ఞ చేసి తొందరగా అక్కడనుండి నిష్క్రమించును)

రా: వీడ్ని పిశాచాలు పీక్కుతినా! (త్రిభులవైపు తిరిగి)
కానీ, వీడి భార్యమీద నేను కవిత్వం రాసాను. అందులోని చివరి వాక్యాలు మరువీచిక చూసాడా?

త్రి: ప్రభువుల కవిత్వం నేనెపుడూ చూడలేదు. రాజుల ‘పల్లవులు ‘ ఎప్పుడూ బాధామయాలే!

రా: శభాష్!

త్రి:  మందలోని కవుల్ని ప్రాసకోసం ప్రేమా- దోమా- అని వాడనీయండి ప్రభూ!  అది వాళ్ళ వృత్తి.  రారాజులు- అందాన్ని  అనునయించడానికి వేరొక పంథా అనుసరిస్తారు.  ప్రేమించండి! ప్రేమని అనుభవించండి ప్రభూ! కవిత్వం రాసుకోవడం మరువీచికలాంటివాళ్ళకు వదిలేయండి. అది మీకు కాని పని.

రా: (శ్రీమతి కాజల్ ని చూసి, త్రిభులని వీడి, ఆమెవైపు పోతూ, త్రిభులతో)

శ్రీమతి కాజల్ తనవైపు నన్ను ఆకర్షించి ఉండకపోతే, నిన్నీపాటికి కొరతవేయిద్దును.

త్రి: (తనలో) అప్పుడే మరొక స్త్రీ. గాలికంటే చంచలంగా నీ మనసు ఆమెవైపు పరిగెడుతోందే!

గద్దే: (త్రిభులను సమీపిస్తూ) రెండో ద్వారం గుండా శ్రీమతి కాశ్యప వస్తోంది. నామెద ఒట్టు వేసి చెప్పగలను. ఆమె ఒక సంకేతాన్ని జారవిడుస్తుంది.  విషయాశక్తుడైన రాజు దాన్ని  తప్పక గ్రహిస్తాడు.

త్రి: అలాగయితే మనం కొంతసేపు నిరీక్షిద్దాం.

(శ్రీమతి కాశ్యప తన పూలచెండుని జారవిడుస్తుంది)

గ: నే చెప్పలేదూ?

త్రి: ఆద్భుతం!

(రాజు కాజల్ ని విడిచిపెట్టి, పూలచెండుని తీసి శ్రీమతి కాశ్యపకి తిరిగి అందిస్తూ, ఆమెతో సహజంగా- ఆత్మీయమైన సంభాషణలోకి దిగుతాడు)

గ: పిట్ట మళ్ళీ వల్లో పడింది.

త్రి: భూతాలలో పెనుభూతం స్త్రీ యే!

(రాజు  శ్రీమతి కాశ్యప చెవిలో  ఏదో సంభాషిస్తాడు.  ఆమె నవ్వుతుంది. ఆమెను అతను నడుం మీదచెయ్యివేసి పొదివి పట్టుకుంటాడు. ఇంతలో రంగస్థలి వెనుకనుండి శ్రీ కాశ్యప ప్రవేశిస్తాడు. గద్దే ఈ విషయాన్ని త్రిభులకు చూపిస్తుంటాడు)

గ: అడుగో, ఆమె భర్త.

(శ్రీమతి కాశ్యప  ఇంతలో తన భర్త రాకను గమనించి, రాజుగారి చెయ్యి విదిల్చుకుని, తొందరగా నిష్క్రమించ ప్రయత్నిస్తుంది)వదలండి!

త్రి: ఓహో! అసూయ అతని ప్రక్కలు ఎగదోస్తోంది.  భ్రుకుటి ముడుతలువేస్తోంది.

(ఇంతలో రాజు దగ్గరికి పానీయాలు రావడంతో, ముందుకు వస్తాడు)

రా: ఆహా! ఎంత ఆనందసమయం!  (ఆనంద పారవశ్యంలో) బృహస్పతి, భీమసేనుడూ ఎందుకు పనికివస్తారు నాముందు. ప్రపంచానికి వన్నెతీసుకు రాగలిగింది స్త్రీలే! నాకిపుడెంతో ఆనందంగా ఉంది.

(త్రిభులతో) మరి నీ సంగతేమిటి?

త్రి: అంతటా సంతోషం వెల్లి విరుస్తోంది.  నాకిలాంటి విందులు, వినోదాలు, దర్పాలూ, తెలివితక్కువలూ, మలిన ప్రేమలూ చూస్తుంటే, మీకు ఆనందం కలిగింఛవచ్చేమో గాని, నాకు నవ్వు వస్తుంది. మీరు ఆనందిస్తుంటే నాకు చికాకు కలుగుతుంది. ఐనా ఇద్దరికీ సుఖమే. మీరు రాజుగా ఆనందిస్తుంటే నేను గూనివాడిగా ఆనందిస్తాను.

ఫ్రా: కాశ్యప ఆనందపు పాలపొంగు మీద నీళ్ళుజల్లుతాడు. అయినా, జరిగేది జరగనీ. (ఆ ప్రదేశాన్ని  విడిచిపెడుతున్న కాశ్యపను చూపిస్తూ) అతని మీద నీ అభిప్రాయం ఏమిటి?

త్రి: మూర్ఖాగ్రేసరుడు.

ఫ్రా: ఈ ముసలి గుండ్రాయి భూస్వామి బాధించినంతగా ఇంకేదీ బాధించడం లేదు. నాకు చెయ్యడానికీ కోరుకుందికీ అనుభవించడానికీ అధికారం ఉంది.  కానీ, త్రిభులా! బ్రతికి ప్రయోజనం ఏమిటి? సుఖం ఏదీ?

త్రి: ప్రభూ! మీరు కాస్త అధికంగా సేవించినట్లున్నారు.

ఫ్రా:  కానీ మద్యం కాదు.  అక్కడకనిపిస్తున్నాయి చూడు. ఓహ్! ఏమి చేతులు!  ఏమి అధరాలు!! ఆహ్! ఏమి కన్నులు!!!

త్రి: ఎవరు? శ్రీమతి కాశ్యపవా?

ఫ్రా: రా! మాతో పరికించుదువు గాని.

( స్త్రీలను చూస్తూ తన్మయత్వంలో)

ఓ పారిస్ బోలిన నగరమా!
సుఖసంతోషాలకు నిలయమా!
ప్రతి ముగ్ధ- ఫ్రౌడయైన నగరము
మీకు సాటి – వేరొకటి కనము- అది సత్యము.

త్రి: (వంత పాడుతూ) ఇక్కడ పురుషులందరూ వయస్కులే!

( ఫ్రాన్సిస్, త్రిభుల నిష్క్రమింతురు)

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: