రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 1 వ భాగం

 ఉపోద్ఘాతం:

19 వ శతాబ్దపు ఉత్తమ కవి, నవలాకారుడు, నాటక రచయితలలో  ఫ్రాన్సుకు చెందిన విక్టర్ హ్యూగో  ఒకరు.  అలెగ్జాండరు  డ్యూమాస్ కు సమకాలికుడైన హ్యూగో, తన 16వ ఏటనే అన్నదమ్ములతో రచనలు ప్రారంభించి,  ప్రాన్సులో  “రొమాంటిక్ మూవ్ మెంట్ ” కు నాయకత్వం వహించేడు.  మొదటి ప్రదర్శనలోనే  హంసపాదు  ఎదుర్కొన్న ఈ నాటకం,  మలి ప్రదర్శనకు నోచుకోలేదు.  కాని అచ్చులో ఈ నాటకం బాగా విజయవంతమయింది.

ఇది నిజ సంఘటనలు ఆధారంగా చేసుకుని వ్రాయలేదని చెప్పినా, ఇందులో  రాచరికపు వ్యవస్థలో జరిగే అకృత్యాలు కళ్ళకు కట్టినట్టు చూపించడంతో దీన్ని పూర్తిగా బహిష్కరించడమే గాక, అతనుకూడా 20 సంవత్సరాలపాటు దేశ బహిష్క్రుతుడయ్యాడు. ఈ సమయం లోనే అతని అత్యున్నత మైన రచనలు వచ్చాయి. ( please visit https://en.wikipedia.org/wiki/Le_roi_s’amuse

ఈ నాటకంలో ప్రత్యేకత  ఇందులోని హీరో. కథానాయకుడు  ఒక   సామాన్య విదూషకుడు.  హ్యూగో కల్పించిన సన్నివేశాలూ, అతని పద ప్రయోగాలూ మనసును ఆకట్టు కుంటాయి.

ఇందులో  కొన్నిపాత్రలకు ఇంగ్లీషు పేర్లకు దగ్గరగా ఉన్న తెలుగు / సంస్కృతం పేర్లు పెట్టేను.    అనువాదంలో, మూలానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ,  సౌలభ్యంకోసం అక్కడక్కడ మన అనుభూతికీ, అవగాహనకీ దగ్గరగా ఉన్నవిషయాలను  వాడడం జరిగింది.  చదువరులు క్షమింతురుగాక.

ఇంతకీ ఈ నాటకం  ఇప్పుడు ఎందుకు అనువదించవలసి వచ్చిందని అనుమానం రావచ్చును. కాలం మారుతోంది గాని, మనుషుల తత్వాలూ, అధికారo ఉన్నవాళ్ళు చెలాయించే జులుం మారలేదు. వ్యవస్థ స్వరూపాలు మారుతున్నాయి. అంతే!  మన కళ్లెదుట జరిగిన సంఘటనలే అందుకు సాక్ష్యం.  రాజులకు బదులుగా మంత్రులూ, గవర్నర్లూ, పోలీసు అధికారులూ, దేశాధ్యక్షులూ, పేరుపడ్డ క్రీడాకారులూ, ఇలా అన్నిరకాల వ్యక్తులూ ఇలాంటి పనులే చేస్తున్నారు చిన్న చిన్న తేడాలతో. ఇది సమాజపు వికృతిని సూచిస్తుంది. మనకు నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు, మనం మనం దాన్ని ముందుగా అభిశంసించాలి. ఈ అభిశంసన ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది.

అమాయకులైన ఆడపిల్లలు చదువుతో నిమిత్తంలేకుండా,  ఇప్పటికీ పై పై మెరుగులకు మోసపోతూనే ఉన్నారు. వ్యక్తిత్వాలను పరిశీలించి జీవిత భాగస్వామిని ఎంచుకునే నేర్పూ, సాహసం ప్రదర్శించలేకున్నారు. హీరోయిజం అంటే దురదృష్టవశాత్తూ ఇంకా సినిమా హీరోయిజమే  హీరోయిజంగా గుర్తిస్తున్నారు. మనకు మార్గదర్శకం కాగలిగిన నమూనాలు లేనప్పుడు, దేన్ని అనుసరించకూడదో తెలుసుకున్నా మంచిదే అన్న ఉద్దేశ్యమూ, దీని వల్ల ఒక్కరికి కనువిప్పు కలిగినా ఈ ప్రయత్నం సఫలం అన్న ఆకాంక్షా, ఎప్పుడో అనువాదం చేసినా, ఇప్పుడు దీన్ని అంతర్జాలంలో ఉంచడానికి ప్రోత్సహించాయి.

అది ప్రక్కన ఉంచితే, ఈ నాటకపు ఇతి వృత్తమూ, దానిని నడిపిన తీరూ నాకు బాగా నచ్చాయి.  మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. ఇది, 5 అంకాల నాటకం. మీ స్పందన ఇతర  ప్రముఖుల కావ్యాల అనువాదానికి ప్రోత్సాహం ఇస్తుందని ఆశిస్తున్నాను.

[ఈ రచన అనువాదానికి ప్రోత్సహించడంతో బాటు, అరుదైన ఈ నాటకం  ప్రతిని  నాకు అందించిన విశాఖ మిత్రులు శ్రీ విరియాల లక్ష్మీపతికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ]

పాత్రలు

ఫ్రాన్సిస్ — రాజు

త్రిభుల– విదూషకుడు

వేలరీ — శ్రీమతి కాశ్యప తండ్రి

గద్దే —

పెన్న–

లాతూరు —

విస్సు —

పార్థివన్ —

కాశ్యప —

బహుగుణ —

మధునిషా —

మాతంగ —

మరువీచి — కవి

సుల్తాను– వృత్తి రీత్యా  హంతకుడు

బాహుదా — త్రిభుల కుమార్తె

భద్రద —    బాహుదా సంరక్షకురాలు

మొగలి  —  సుల్తాను చెల్లెలు

శ్రీమతి కాశ్యప

రాణిగారి దగ్గర నుండి  ఒక వార్తా హరుడు  

రాజ  భటుడు

ఒక వైద్యుడు

రాజ పరివారం– స్త్రీలు– సేవకులు

————————————————————————————-

“వేలరీ”

ప్రథమాంకము — దృశ్యం 1

[తెర తీయగానే  ఒక అందమైన  భవంతి. భవనం నిండా అతి ముఖ్యులైన వ్యక్తులు, రాజ బంధువులు, అందంగా అలంకరించుకున్నవారి శ్రీమతులు, అక్కడ ఒక పెద్ద విందు జరుగుతోందని చెప్పకనే చెబుతోంది.  చక్కగా  అలంకరించిన “షాండిలేయర్స్” నుండి సన్నసన్నగా వెలుగులు జాలువారుతుంటాయి. సంగీతం– నవ్వులు —  కేరింతల మధ్య — బంగారు, వెండి, పోర్సిలిన్ కప్పులు అమర్చిన ట్రే లలో తినుబండారాలు , పానీయాలు అందించడానికి హడావుడిగా సేవకులు తిరుగుతుంటారు.  వేదికకు అటునుంచి ఇటూ , ఇటునుంచి అటూ గుంపులు గుంపులుగా అతిథులు మాట్లాడు కుంటూ వెళ్తుంటారు . కిటికీల గుండా సన్నని కిరణాలు ప్రసరించడంతో — ఆనందోత్సాహాలకు భరతవాక్యం పలుక బడుతుంది . అక్కడ ద్వార బంధాలపై , తలుపులపై, కిటికీలపై కనిపించే పనితనం , అక్కడ మేజాలు, కుర్చీలు, సోఫాలు, అక్కడకు విచ్చేసిన అతిథుల వేష ధారణా — ఇవన్నీ అన్నీ “రెనైజాన్సు ” కాలం నాటి అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి…. 

[రాజుగారు, లాతూరు ప్రవేశం]

ఫ్రాన్సిస్ : విజయాన్ని వరించే వరకూ, ఈ సాహసోపేతమైన  వేట విడిచిపెట్టలేను. ఆమె సామాన్య స్త్రీ అయితే అవుగాక! జన్మ వృత్తాంతం తెలియకపోతే తెలియకపోవుగాక!! పేరూ, సమాజంలో ఒక స్థాయీ, అన్నవి ఎరిగి ఉండకపోతే పోవచ్చుగాక!!! అయితేనేం? అంతటి అందాన్ని నేనింత వరకు చూడలేదు.
లాతూరు: అయితే ఆ నగర సుందరిని ‘హోలీ మాస్ (Holy Mass)” లో కలవబోతున్నారన్నమాట!

ఫ్రా: St. Germain des Prés. చర్చిలో@ ప్రతి ఆదివారం కలుస్తూనే ఉన్నాను.
లా: అంటే, మీరు రెండు నెలలుగా ఆమెను అనుసరిస్తున్నారన్నమాట.
ఫ్రా: అవును.
లా: ఆమె బస ఎక్కడో?
ఫ్రా: మన కాశ్యప  నివాసమూ, బుస్సీగారి డాబాకు దగ్గర. అక్కడ ఆమె బందీ.
లా: ఆ ప్రాంతం నాకు తెలుసుననే అనిపిస్తోంది. అంటే, ఆ పరిసరాలు మాత్రమే. ప్రభువులకు తెలిసినంతగా ఆ స్వర్గ ధామం  ‘లోనగరి’ గూర్చి తెలియదు.
ఫ్రా: అదిగో! ఆ పొగడ్తలే వద్దన్నది.  ప్రవేశము అందరకూ లేదు.  నిశితమైన చూపులూ, కొనదేరిన నాలుకా, పాముచెవులూ ఉన్న ఒక సంరక్షకి ఆమెను హమేషా కనిపెట్టుకుని ఉంటుంది.
లా: నిజంగా?
ఫ్రా: అంతకంటే నిగూఢమైన విషయం ఇంకొకటి ఉన్నది.  చీకటి పడగానే, మానవాకారాన్ని పోలిన ఒక గుర్తు తెలియని ఆకారం- చీకటి ముసుగులో- మరి ఏ చీకటి పనులు చెయ్యడానికోగాని, లోనికి ప్రవేశిస్తుంది.
లా: అయితే తమరూ దాన్నే అనుసరించండి.
ఫ్ర:లాభంలేదు. ఆ ఇల్లు ఇతర ప్రపంచానికి అలభ్యం.  అభేద్యం.
లా: పోనీ. ఇంత ఓపికతో వెనుకబడుతున్నారుకదా! ఆ చిన్నది, ఆ కన్నె, ప్రభువుల్ని, కన్నెత్తి అయినా చూసిందా? ఆశల ఆనవాళ్ళేమయినా గోచరిస్తున్నాయా?
ఫ్ర: చూపులు మనసుకి టిప్పణి అనుకుంటే, ఆ మంత్రించే కనులలో ద్వేషపు ఛాయలు  గోచరించడంలేదని మాత్రం చెప్పవచ్చు.
లా: పోనీ, ప్రభువులు ఆమెను ప్రేమిస్తున్నారన్న విషయం ఆమెకు విశదమేనా?
ఫ్ర: అసంభవం. సాధారణమైన వేషం లో, ఒక విద్యార్థిలా నన్ను నేను మరుగుపరుచుకున్నా.
లా: ఆహా! ఏమి ఉదాత్తమైన ప్రేమ! ఆర్పలేని అమలిన జ్వాల!
ఆమె తప్పక ఏ పూజారి ప్రేయసియో అయి ఉంటుంది.
(ఇంతలో  త్రిభుల, మరికొందరు సభికులు ప్రవేశిస్తుంటారు)
ఫ్ర: హుష్! నిశ్శబ్దం. ఎవరో వస్తున్నారు.
(త్రిభుల రాక చూసి, అతనితో)
ప్రేమలో గెలవాలనుకున్న వ్యక్తి
పెదాలను మౌనంతో అతకాలి గదూ?
త్రిభుల: పతనశీలమైన కుప్పెకు గాజు తన ఆకారం అందిస్తోంది.
అలాగే, నిర్వీర్యమైన ప్రేమను-  పేలికల వంటి తంత్రం దాచబోతోంది.
**  **  **

@ ( ఇది ఐఫిల్ టవర్ కి పశ్చిమంగా ఉంటుంది)

(ఇంకా ఉంది)

————————————————————————————

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: