అనువాదలహరి

నీ జ్ఞాపకాలు…Shernaz Wadia, Indian Poet

ఇక నుండీ నన్ను వివశను చేసే నీ చిరునవ్వూ,
చూడు, అలా నవ్వితే చిన్నగా సొట్టలు పడే నీ బుగ్గలూ,
బుంగ మూతీ, కనుమరుగే కదా!

చుట్టూ ఉన్న రణగొణధ్వనిని కూడా ఛేదించుకుని,
రహస్యంగా నా చెవుల్లో నెమ్మదిగా ఊసులాడి
నా ఏకాంతపు విషాదాశ్రువులు తుడిచి నన్నూరడించే
నీ కమనీయ కంఠధ్వని, ఉహూ, ఇక ఎన్నటికీ దొరకదు కదా!!

ఇంద్రజాలం చేసే నీ కర స్పర్శ అందనంతదూరమైనా,
నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే,
చిత్రంగా నా కింకా జీవించాలన్న లాలస రగిలిస్తూనే ఉంది.
ఉద్వేగ భరితమైన నా జీవిత గమకాల్ని
అలవోకగా అర్థంచేసుకుని నన్నలరించే
నీ కన్నుల దయార్ద్ర రుచి ఇక శాశ్వతంగా మృగ్యమేకదా!!!

అన్నిటినీ మించి,ఏకాంతం నన్ను చుట్టుముట్టి
దిగులుతో మనసు పొగులుతున్నప్పుడు,
ప్రియాతి ప్రియమైన నేస్తమా! నువ్వే నా చెంత నుండవు!!!

English Original: Shernaz Wadia

%d bloggers like this: