అనువాదలహరి

ఆప్త మిత్రుడికి… Shernaz Wadia, Indian Poet

మిత్రమా!
తీరని ఈహల నిర్జీవ హృదయాన్ని నీ కిచ్చాను.
లలితజీవన చుంబనాన్ని దానిపై నువ్వు ప్రసరించావు.
ఇపుడది కొంగ్రొత్త జవంతో కేరింతలు కొడుతోంది.

ఆప్తుడా!
తప్త కాంక్షల చితా భస్మాన్ని నీకిచ్చాను.
దాన్ని నీ ప్రేమ పేటికలో భద్రపరిచావు.
ఇపుడది పునరుజ్జీవనంతో కళకళలాడుతోంది.

నేస్తమా!
పీటముడులుపడిపోయిన ఆలోచనల పోగులను
నీ ముందుంచాను.
అవిఛ్ఛిన్న ప్రశాంతతతో చిక్కులు విప్పి
నాకు సాంత్వన నందించావు.

సహచరుడా!
రసహీనమైన నా జీవితాన్ని నీ ముందు పరిచాను.
దయార్ద్రహృదయంతో దానికి ప్రేమలేపనం పూసావు.
చూడు! ఇప్పుడది ఎన్ని సుగంధాలు వెదజల్లుతోందో!

ఆంగ్ల మూలం: Shernaz Wadia, Pune

%d bloggers like this: