అనువాదలహరి

రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 3 వ భాగం

అంకం 2  దృశ్యం 3

(త్రిభుల, బాహుదా, కొంత సమయం గడిచిన తర్వాత భద్రద)

త్రి:  తల్లీ! (ఆమెను గుండెకు అదుముకుంటాడు… ఆనందాతిరేకంతో)

ఏవీ! నీ చేతులు నా మెడచుట్టూ వెయ్యి.  దగ్గరగా రా తల్లీ!   అబ్బ! ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. నీ దగ్గర అంతా ఆనందమే! నాకు మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్లుంది.    (త్రిభుల ఆమెను తదేకంగా చూస్తుంటాడు)

రోజురోజుకీ నీ అందం ద్విగుణీకృతం అవుతోంది బాహుదా! అంతా బాగుంది కదా!  నీకు ఏ కష్టం కలగడంలేదు కద? ఏదీ ఒక్కసారి వచ్చి ఒక ముద్దు ఇవ్వు.

బా: నువ్వెంతో మంచి నాన్నవి. (ముద్దు పెట్టుకొనును)

త్రి: నిజంగానే? కాదు.  నువ్వంటే నాకు ప్రేమ.  నువ్వే నాప్రాణం. నా జీవం. బాహుదా! నువ్వుదూరమయిన నాడు- అబ్బా! ఆ ఊహే ప్రాణాంతకంగా ఉంది.
బా: (త్రిభుల నుదిటిమీద చెయ్యి వేస్తూ) ఎందుకంత బరువుగా ఊపిరితీస్తున్నావు నాన్నా? నీ బాధలు నాతో పంచుకోవూ?  అయ్యో! నాకు మన కుటుంబం గురించి ఏమీ తెలియదు.

త్రి: అమ్మలూ! మనకు ఎవ్వరూ లేరు.

బా: పోనీ, నీ పేరయినా చెప్పవచ్చుకదా?

త్రి: పేరు తెలుసుకుని ఏమి చేస్తావు?

బా: నేను “చినవాడ” గ్రామంలో  ఉన్నప్పుడు — నువ్వువచ్చి నన్ను ఇక్కడకు తీసుకునివచ్చేదాకా అందరూ నన్ను అనాధ  అనేవారు.

త్రి: నిన్నక్కడ వదిలేసి ఉంటేనే బాగుండునేమో తల్లీ! కానీ, నేను నా బాధామయ జీవితాన్ని ఇక సహించలేక నిన్ను తీసుకు వచ్చేను.  నీ కోసం పరితపించేను.  నన్ను ప్రేమించే ఒక జీవికోసం తహ తహ లాడిపోయేను.

బా: పోనీ, నీ పేరు చెప్పకపోతే…

త్రి: (ఆమె మాటలు పట్టించుకోకుండా) నువ్వు బయటకు ఎక్కడికీ వెళ్ళడంలేదు గద!

బా: నేనిక్కడకు వచ్చి రెండు నెలలయ్యింది.  ఈ మధ్యకాలంలో చర్చికి మాత్రం  ఏడెనిమిది సార్లు వెళ్ళిఉంటానేమో!
త్రి: మంచిది.

బా: పోనీ ఇప్పుడైనా నా తల్లిగురించి చెబుతావా నాన్నా?

త్రి: వద్దమ్మా, వద్దు.  మళ్ళీ ఆ తీగను మీటకు తల్లే, మీటకు. నేనెంత విలువైన  వస్తువును కోల్పోయానో నాకు మళ్ళీ గుర్తు చెయ్యకు. నువ్వేగాని ఎదురుగుండా లేకపోయుంటే, అదంతా ఒక కలగా భ్రమించి తీసిపారేసేవాడిని.

మిగతా అందరి స్త్రీలకన్న విలక్షణమైనది మీ అమ్మ.  నేను పేదవాడినని, కురూపినని, ఏకాకినని, రోగిష్టినని, తెలిసిమరీ ప్రేమించింది. నా దౌర్భాగ్యాన్ని కూడా.

పోతూ, పోతూ, తనతో పాటే, ఆమె అమరప్రేమ రహస్యాన్ని సమాధిలోకి తీసుకునిపోయింది. మెరుపుకంటే వేగవంతమూ,  క్షణికమూ అయిన ప్రేమ! నరకాన్ని కూడా జేగీయమానం చెయ్యగల ఒక స్వర్లోక ప్రకాశరేఖ.

ఓ పృధ్వీ! ఆ దేవత హృదయంపై తేలికగా నడయాడుమీ!
నా దుఃఖాలనుండీ, నా కష్టాలనుండీ నేను సేదదీరగలిగిన ఏకైక సదనం అదే!
(బాహుదాతో) నువ్వు నాకు మిగిలావు.  భగవంతుడా! అందుకు నేను నీకు సర్వదా కృతజ్ఞూణ్ణి.

(పట్టలేని దుః ఖంతో ఏడ్చును)
బా: అయ్యో! ఎంతహృదయవిదారకమైన రోదన! నాన్నా! నువ్వలా ఏడుస్తుంటే చూడలేకున్నాను. అది నన్ను అశక్తురాలినిచేస్తోంది.

త్రి: నన్ను నవ్వమంటావా తల్లీ!

బా: నన్ను క్షమించు నాన్నా! నీ పేరు చెప్పు. నీ దుఃఖాన్ని నాతో పంచుకో!

త్రి: నేను నీ తండ్రిని. అంతే! అంతకుమించి నన్నేమీ అడగవద్దు తల్లీ! ఈ విశాల విశ్వంలో నన్ను ద్వేషించే వారు కొందరయితే, ఏవగించుకునేవారు కొందరు.  కానీ, కనీసం ఇక్కడైనా- అమాయకత్వం ఉన్న ఈ చోట- నేను తండ్రిగా ప్రేమించబడి, గౌరవించబడతాను.  పిల్లలకు “నాన్న” అన్న మాటకంటే పవిత్రమైనది ఇంకేముంటుంది చెప్పు?

బా: నాన్నా!
త్రి: ఓహ్! ఏ హృదయం నీ మనసులా ప్రతిస్పందిస్తుంది?  ఇతరులని ఎంత తీవ్రంగా ద్వేషిస్తానో, నిన్నంత గాఢంగా ప్రేమిస్తాను. రా! నా దగ్గరగా వచ్చి కూచో! మనిద్దరం మాటాడుకుందాం. నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా?

మనిద్దరం   ఇక్కడ కలిసి కూర్చున్నాం కాబట్టి, నీ చిన్ని చేతులు నాచేతుల్లో  ముడిబడి ఉన్నాయికాబట్టి, తల్లీ, నిన్ని తప్పించి ఇంకెవరిగురించో ఎందుకూ మాట్లాడుకోవడం?

భగవంతుడు నాకు ప్రసాదించిన వరం ఏమిటో తెలుసా తల్లీ? ప్రపంచంలో అందరికీ, తల్లిదండ్రులూ, తోబుట్టువులూ, మనవలూ, మునిమనవలూ, స్నేహితులూ, భార్యలూ, ప్రితురాండ్రూ, భర్తలూ, బానిసలూ, సుదీర్ఘమైన వంశపరంపరా, ఇలా ఎన్నెనో. కాని నాకు మాత్రం- నువ్వు ఒకర్తెవే! కొందరే భాగ్యవంతులు. అందులో నేనొకడ్ని. నువ్వే నాసంపద. నా సర్వస్వం.  కొందరు దేవుడ్ని నమ్ముతారు. నే నిన్ను నమ్ముతాను.  నిన్నేనమ్ముతాను. ఇకనాకు వయసుతోకాని, స్త్రీసుఖంతోగాని, పేరుప్రఖ్యాతులతోగాని, గౌరవసత్కారాలూ, ధనధాన్యాలతోగాని  ఏమిపని? ఇవన్నీ అందరూ అర్రులుజాచేవే.  కాని, నువ్వు వీటన్నిటినీ అధిగమిస్తావు.

దేశమైనా, నగరమైనా, కుటుంబమైనా,  నాకు అన్నీ నువ్వే. నా సంపద, నా సుఖం, నా నమ్మకం, ఆశ, ప్రపంచం అన్నీ నీలోనే చూసుకుంటా. నువ్వు తప్ప మిగతా ప్రపంచం అంటే  నా మనసు కుంచించుకుపోతుంది.  నిన్నుగాని కోల్పోయేనా, అది నన్ను భయవిహ్వలుడిని చేసే ఒక ఆలోచన-  అది  ఇంకొక్క క్షణం నన్నంటిపెట్టుకుంటే, నా ప్రాణాలు పోవడం తథ్యం.  ఏది తల్లీ, ఒక్క నవ్వు నవ్వు.  బాహుదా! నీ అందమైన  అమాయకమైన చిరునవ్వు అచ్చం మీ అమ్మనవ్వులాగే ఉంటుంది.  ఆమెకూడా- నిరలంకారమైనదే! నీ నుదురు మీదచెయ్యి వేసి ఒత్తికుంటావు చూడూ, తల్లీ, అది అచ్చం మీ అమ్మ పోలికే! నాహృదయం చిమ్మ చీకటిలో కూడ నీ దగ్గరకే ఉరుకుతుంది.  ఊహించుకోగలను. నువ్వే నాఉషస్సువి .కంటి వెలుగు.  జీవన సర్వస్వం.

బా: నాన్నా! నేను నిన్ను సుఖపెట్టగలిగితే అంతకంటే కావలసినదేముంటుంది?

త్రి: సుఖపెట్టడమా?  బాహుదా! నీ రూపం చాలదూ, నన్ను ఆనంద పారవశ్యంలో ముంచితేల్చడానికి? (ఆమె తల నిమురుతూ, నవ్వుతూ) ఎంత ఒత్తైన కురులు! నాకు బాగా గుర్తు.  ఒకప్పుడు ఇది చాలా పలచగా ఉండేది.  ఎవరునమ్మగలరు, ఇంత దట్టంగా, నల్లగా అవుతాయని?

బా: ఏదో ఒకరోజు, సాయం సంధ్యా రావం వినిపించే లోగా, నగర దర్శనానికి అనుమతిస్తావు గద, నాన్నా!
త్రి: అమ్మో! ఎన్నటికీ ఇవ్వను. నువ్వు ఇప్పటివరకు భద్రదతో తప్ప ఒంటరిగా గుమ్మం కదలడంలేదు కద!

బా: అబ్బే, లేదు.
త్రి: జాగ్రత్త సుమా!
బా: నేను ఒక్క చర్చికి మాత్రమే వెళ్ళివస్తున్నాను.
త్రి: (తనలో) ఆమెను ఎవరైనా చూడవచ్చు. అనుసరించవచ్చు.  నాదగ్గరనుండి లాక్కుని, ఆమెను బలాత్కరించ వచ్చు. అయ్యో! అదేగాని జరిగితే, ఈ దౌర్భాగ్యపు విదూషకుడి కుమార్తెపై ఎవ్వరూ జాలీ, కనికరమూ చూపించరు.
(ప్రకాశంగా) నిన్నువేడుకుంటాను బాహుదా! నువ్వు బయటకు వెళ్ళకు.  ఈ నగర వాతావరణం ఎంత కలుషితమో, ఎంత ప్రాణాంతకమో, నీకు తెలియదు. మరీ ముఖ్యంగా స్త్రీలకు. హృదయం లేని స్త్రీలోలురు రోడ్లమీద విచ్చలవిడిగా తిరుగుతుంటారు. వాళ్ళకంటే నీచులు రాజదర్బారులోని  ప్రతినిధులు.

(తనలో) ఈ ప్రమాదభూయిష్టమైన  ఉచ్చులనుండి నా చిట్టితల్లిని భగవంతుడు సర్వదా కనిపెట్టుకుని రక్షించి, కాపాడుగాక!  నా కుమార్తెతో సరితూగగల అందాలున్న కన్నెమొగ్గలను కేవలం వాళ్ల ఊపిరి తగలగానే భ్రష్టుపట్టించగల విశృంఖలులున్నారిక్కడ.  ఆమె కలలు కూడ పవిత్రంగా ఉండుగాక!  కనీసం ఇక్కడైనా ఈ నిర్భాగ్యుడైన తండ్రి, అశ్రాంతమైన కష్టాలనుండి విశ్రాంతి తీసుకుని, ఈ అమాయకురాలి అనిర్వచనీయమైన  ప్రేమామృతాన్ని  తనివితీరా గ్రోలగలుగుతున్నాడు.
(చేతిలో ముఖందాచుకుని వెక్కి వెక్కి ఏడ్చును)

బా: ఇంకెప్పుడూ బయటకు వెళ్ళడంగురించి ఆలోచించను నాన్నా! ఏడవకు.

త్రి: ఈ కన్నీళ్ళు నాకు ఉపశాంతినిస్తాయి తల్లీ! నిన్న రాత్రి నేను ఎంతగా నవ్వేనో  నాకే తెలీదు.  ఆ! మరిచాను. నేను ద్వేషించే వాళ్ళను మళ్ళీ కలుసుకోవలసిన ఘడియలు సమీపిస్తున్నాయి.  వస్తానమ్మా, బాహుదా!

బా: (కౌగిలించుకుంటూ) మళ్ళీ తొందరలోనే ఇక్కడకు వస్తావు కదూ, నాన్నా?

త్రి: ప్చ్! నేను పరాధీనుణ్ణి తల్లీ!
ఓ, భద్రదా! ( పిలుచును)

(ఒక ముసలి సంరక్షకురాలు ప్రవేశం) నేను లోనకు రావడం ఎవ్వరూ కనిపెట్టలేదు గద!

భద్రద: లేదు. ఎవరూ చూడలేదు. అసలు ఈ వీధే నిర్మానుష్యం, స్వామీ!
(అప్పటికి చీకటి బాగా అలుముకుంటుంది. గోడకు అవతల రాజు ముదురు రంగు బట్టలువేసుకుని  ప్రత్యక్షం అవుతాడు.  ఆ గోడనీ,  మూసి ఉన్న తలుపునీ విసుగుని సూచించే చేష్టలతో పరిశీలిస్తూ, అసహనం ప్రదర్శిస్తాడు.)
త్రి: వస్తాను బాహుదా! ఉంటా!
(భద్రదతో) సముద్రంవైపు  తెరుచుకునే తలుపు ఎప్పుడూ మూసేఉంచుతున్నావు గదా! సెయింట్ జెర్మేన్ చర్చి సమీపంలో ఇంతకంటే నిర్మానుష్యమైన ఇల్లు  చూశాను. దాని సంగతి రేపు ఆలోచిస్తాను.
బా: ఈ డాబా మీదనుండి తోటకనిపిస్తూ చాలా బాగుంది నాన్నా!

త్రి: (గాభరాగా) డాబా మీదకు వెళ్ళవద్దు తల్లీ! (అతను చెవులు రిక్కించి వింటాడు) అదిగో! ఎవరివో అడుగుల చప్పుడు.(అతను ద్వారం తెరిచి, బయటకు తొంగి చూచును.  తలుపుకి దగ్గరగా ఉన్న ఖాళీ జాగాలో రాజు దాక్కొనును. త్రిభుల మళ్ళీ తలుపు పూర్తిగా వేసేలోగా)

బా: (డాబా వైపు చూపిస్తూ) మరి నేను రాత్రిపూటైనా నిర్మలమైన గాలి పీల్చుకోవద్దా, నాన్నా?

త్రి: ఏం చెయ్యను? నువ్వు అందరికీ కనిపిస్తావు.

( అతను వీపుద్వారం వైపు ఉంచి బాహుదాతో మాట్లాడుతుండగా, ఒరవాకిలిగా తెరుచుకుని ఉన్న తలుపు లోంచి ఎవరికీ కనిపించకుండా రాజు లోనకు దూరి ఒక చెట్టువెనుక దాగుంటాడు.)

(భద్రదతో) ఈ చావడిలో ఎక్కడా దీపం వెలిగించవద్దు)
భ: ఏమీ? ఏ మనిషి లోపలికి రాగలడు?

(ఆమె తలతిప్పి  చెట్టువెనక నక్కి ఉన్న రాజును చూసి గట్టిగా అరవబోయేలోగా, రాజు ఆమె వంక  ఒక డబ్బు సంచీ ఊపుతూ అందిస్తాడు. ఆమె దాన్ని చేత్తో సరిచూచుకుని, మౌనంగా ఊరుకుంటుంది.)
బా: (లాంతరుతో డబా నలుమూలలా పరిశీలుస్తున్న త్రిభులతో) ఏమిటి వెతుకుతున్నావు? దేనిగురించి నీ భయం నాన్నా?
త్రి: నాగురించి కాదు.  అంతా నీగురించేనమ్మా!
(అతను ఆమెను దగ్గరకు తీసుకుంటుండగా భద్రద చేతిలోని దీపం వెలుగులు ఒక్క క్షణం వాళ్ళిద్దరిమీద పడతాయి)
రా: ఓహ్! వీడా! త్రిభుల! (నవ్వుతాడు) త్రిభుల కూతురు! అయితేనేం? రసాధిదేవత!

త్రి: (వెనక్కి వస్తూ) ఒక ఆలోచన నన్ను కలవర పెడుతున్నాది. నువ్వు చర్చినుండి వెనుదిరిగి వస్తున్నప్పుడు నిన్నెవరూ అనుసరించలేదు గదా!
(బాహుదా ఏమీ చెప్పలేని స్థితిలో నేలచూపులు చూస్తుంటుంది)

భద్రద: లేదు. ఎన్నడూ లేదు.

త్రి: ఒక వేళ  నిన్ను ఎవరైనా అడ్డగించినా, అత్యాచారం చెయ్యబోయినా గట్టిగా అరిచి కేకలు వెయ్యు. ఏం?

భ: నేను గావుకేకలు వేస్తాను. రక్షక భటుల్ని పిలుస్తాను.

త్రి: తలుపు ఎవరు తట్టినా సరే, మూసే ఉంచు. తెరవ వద్దు.

భ: రాజుగారు వచ్చినా కూడానా?

త్రి: రాజుగారు వస్తే- మరీనూ.

(బాహుదాను మరొకసారి కౌగిలించుకుని- జాగ్రత్తగా తన వెనకే తలుపు మూసి నిష్క్రమించును)

(సశేషం)

రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 2 వ భాగం

ద్వితీయాంకం  దృశ్యం 2

త్రిభుల  (ఏకాంతంలో)

[సుల్తాన్ కనుమరుగవనిచ్చి,  ప్రహారీ గోడ తలుపు నెమ్మదిగా తెరుస్తాడు. ఆదుర్దాతో నాలుగు దిక్కులూ పరిశీలించి, కప్పనుండి తాళం  తొందరగా తీసి, లోపలికి వెళ్ళి మళ్ళీతాళం వేసుకుంటాడు. విచారవదనంతో అన్యమనస్కుడై అడుగులు వేస్తుంటాడు]

ఆ ముదుసలి నన్ను శపించాడు.  అతను మాటలాడుతున్నప్పుడు కూడా నేను అతన్ని అనుకరించి అవహేళన చేశాను.  పాపం శమించుగాక! నా పెదాలే నవ్వాయి. అతని విషాదం నా గుండెను తాకింది.  నిజంగా శాపగ్రస్తుడే.  (నాపరాయి పలక మీద కూర్చుంటాడు.)

పరిసరాలతో నా బాహ్యరూపం కుమ్మక్కై,  నన్ను హృదయం లేనివాడిగా, కౄరుడిగా, పాషండుడిగా, చేస్తుంది.

బఫూన్! ఓరి భగవంతుడా!  అనాకారిగా, అందరూ అసహ్యించుకునేట్టుగా, అవమానించేట్టుగా ఎందుకు సృష్టించేవయ్యా? 

ఆ ఆలోచన  పడుక్కున్నా, మేలుకున్నా, చివరకి కలల్లోకూడా వెంటాడుతోంది.     మెలకువలో చిత్రవధ చేస్తోంది. 

 ఈ కౄరుడైన బఫూన్, దరిద్రపు దర్బారు విదూషకుడు- తల అమ్ముకున్న నేరానికి- నవ్వడం,  నవ్వించడం మినహా ఇంకేదీ చెయ్యలేడు.  చెయ్య కూడదు.  సాహసించకూడదు.

ఎంత దౌర్భాగ్యం!    ఏమిటీ బాధ!

 ఆఖరికి కటిక దరిద్రుడైనా, నీచాతినీచుడైన బానిస అయినా, మరణదండన విధించబడి శృంఖలాబధ్ధుడైన  నేరస్థుడైనా,  వాడి బాధని కన్నీళ్లతో కడుక్కునే వీలుంటుంది.  కానీ, నాకు అటువంటి అవకాశం లేదు.  బాధాకరమైన బలహీనతలతో- నేలకు ఒదిగి ఉండడం కష్టం.  అంతకు మించి నన్నుచుట్టు ముట్టి ఉన్న ఈ అందాలూ, అధికారాలూ, ఈ మగసిరులూ, తళతళలూ నన్నింకా విచారగ్రస్తుణ్ణిచేస్తున్నాయి.  నా దౌర్భాగ్యం మగసిరినుండి దాగనూలేదు. నా హృదయం ఒంటరిగా విచారాన్ని వెలిగ్రక్కనూలేదు.

నా ప్రభువు- ఈ రాజ్యాధినేత- ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ ఉంటాడు. మృత్యుభీతి లేనివాడు, మగువలపొందు వదలని వాడు, రూపసి.  వర్ఛస్సుగలవాడు. నేను దాగుంటే, నన్ను కాలితో అటూ, ఇటూ తంతూ, “ఏయ్ బఫూన్, కానీ, నాకు వినోదం కల్గించు” అంటాడు. పాపం బఫూన్! నేనూ మనిషినే.  నామదిలో కూడా దహించే విద్వేషం, గర్వం, అణచుకోలేని కోపం,  సలసల మరుగుతుంటాయి.  నన్ను యమయాతనకు గురిచేస్తుంటాయి. 

నేను ఎప్పుడూ ఏదో పన్నాగం పన్నాలి.  నా ఆలోచనలు, వ్యక్తిత్వం, ఆవేశాలు, అన్నీ దాచుకుని మా యజమాని ఆజ్ఞ మేరకు అందరకూ వినోదం కలిగించవలసిందే. ఇంతకంటే కనికిష్టమైన దాస్యం మరొకటి ఉండదు. నేను కదలినప్పుడల్లా నా కాలికి వేసిన ఈ శృంఖలం నన్ను బాధిస్తుంటుంది.   మగవాళ్ళందరిచే ఉపేక్షించబడి, ద్వేషించబడి, నేలకు త్రొక్కివేయబడ్డాను. స్త్రీలందరిచే కరవనికుక్కగా గుర్తింపు పొందాను.

 వీరాధివీరులారా! దర్బారులోని  సాహసవంతులారా!  మిమ్మల్నినేనెంతగా ద్వేషిస్తున్నానో మీకు తెలియదు.  ఇదే హెచ్చరిక!  ఇక్కడ మీకొక శత్రువున్నాడు జాగ్రత్త! మీరు నాకు చేసిన ప్రతి అవహేళనకీ, ఏవగింపుకీ తగిన ప్రతిఫలం అందిస్తాను. మీ అహంభావపూరితమైన పాచికలు పారకుండా వాటికి ఆదిలోనే హంసపాదులు సృష్టించడమో,  పురిట్లోనే సంధికొట్టేలా ప్రయత్నం చెయ్యడమో చేస్తాను. మీ యజమాని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ  మీ ఆశా సౌధాలు కూలుస్తాను.  మీ కాంక్షాపుష్పాలకు- రేకు వెంబడి రేకు – విడదీసి, అది పుష్పించకముందే, మొగ్గలోనే త్రుంచెస్తాను.  మీరే నన్ను దుర్మార్గుడిగా మారుస్తున్నారు. 

కానీ,  ఛీ! ఇతరుల ఆనందక్షీరంలో  విషపు చుక్కలు చిందించడానికి  బ్రతికే బ్రతుకూ- ఒక బ్రతుకేనా!

 ఒక సాత్త్విక భావం మదిలో మెదిలితే, దాన్ని బయటకు వెలిగ్రక్కకుండా, ఈ గంటల గలగలల మధ్య దాన్ని సమాధిచెయ్యవలసిందే కదా!

ఒక రక్కసిలా,  అన్నీధ్వంసం చెయ్యాలనిపిస్తుంది.   ఆటకోసం, మీ అందరి ఆనందం కోసం నా హృదయాన్ని దొలిచేస్తున్న విద్వేషాన్ని,  ఒక శూన్యమైన, అబధ్ధపు చిరునవ్వునొకదాన్ని ముఖానికి పులుముకుని నడవవలసి వస్తుంది. ఇంతకన్న దారుణమైన, హేయమైన స్థితి ఇంకేముంటుంది?

(చపటా మీచి లేస్తాడు.)
లేదు. ఇక్కడ విషాద ఛాయలు లేవు. ఒక సారి ఈ గుమ్మందాటేనంటే, ఒక వింత ప్రపంచం ఆవిష్కృతమౌతుంది.  ఈ ప్రపంచాన్ని ఇక్కడే మరిచిపోదాం.  గతకాలపు వెతలు, ఎదురుచూస్తున్న ఆనందపు ఘడియల ఉత్సుకతను ఏమాత్రం  తగ్గించలేవు.
(మళ్ళీ ఆలోచనలలోకి వెళ్ళిపోతాడు)

ఆ ముదుసలి నన్ను శపించాడు.  ఈ ఆలోచనే మళ్ళీ మళ్ళీ  ఎందుకు పునరావృతం అవుతోంది?

అది రాబోయే విషాదానికి సంకేతమా?  బాబోయ్ కొంపదీసి నాకు పిచ్చి గాని ఎత్తడంలేదు కద!
(అతను నెమ్మదిగా తలుపు తడతాడు. ధవళవస్త్రాలు ధరించిన  ఒక చిన్నారి కన్నియ  పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతులలో 
వాలిపోతుంది

 ( సశేషం )

రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం, 1వ భాగం

ద్వితీయాంకం  దృశ్యం 1

[ బుస్సీ గారి భవంతి. ఎక్కడా జనసంచారం కనిపించదు. ఆ భవంతికి కుడిప్రక్కగా చూడచక్కని ఒక ఇల్లు.  పెద్ద ప్రహారీ గోడ.  ముందు విశాలమైన ఖాళీ స్థలం.  ఖాళీ స్థలంలో రకరకాల వృక్షాలు. కూర్చునేందుకు ఒక నాపరాయి పలక.  ప్రహారీ గోడకు  వీధిలోకి తెరుచుకుంటూ తలుపు.  ప్రహారీ గోడమీదనుండి డాబా- క్రింద అందమైన “ఆర్చ్”లు. మేదమీద గదినుండి డాబా మీదకు తెరురుచుకున్న తలుపు.  డాబా నుండి క్రిందకు ఒక ప్రక్కగా మెట్లు. బుస్సీగారి భవంతికి ఎడమప్రక్కగా కాశ్యప భవనం. దానివెనుక  దూరంగా చెదురుమదురుగా ఇళ్ళూ, దూరంగా కనిపిస్తున్న సెయింట్ సెవెరిన్ చర్చి (St. Severin Church) గోపురమూ.

ముందుగా త్రిభుల, సుల్తాన్ ప్రవేశం.        కొంత సేపు పోయిన తర్వాత పెన్న, గద్దే .

త్రిభుల తలపై ఇప్పుడు విదూషకుడి తలపై ఉండే రంగురంగుల కుచ్చు టొపీ ఉండదు. వేషం మారి, ఇపుడు అతను ముసుగులో ఉంటాడు.  ప్రహారీ గోడ తలుపు దగ్గరకు అడుగులో అడుగు వేసుకుంటూ సమీపిస్తుంటాడు. సుల్తాన్ కూడా అతన్ని ముసుగు వేసుకునే అనుసరిస్తుంటాడు.  ముసుగులోంచే అతని చేతిలోనున్న ఒక పొడవైన కత్తి తళతళలాడుతూ మెరుస్తుంటుంది.]

త్రి: (విచారంతో) ఆ ముసలివాడు నన్ను శపించాడు!

సుల్తాన్: (అనుసరిస్తూ) అయ్యా!

త్రి: (ఆశ్చర్యంతో వెనుకకు తిరిగి చూసి, జేబులు తడుముకుని- కోపంతో) ఫొ! నీ అవుసరం నాకు లేదు.

సు: అవమానం! నేను మిమ్మల్ని యాచించడానికి రాలేదు.

త్రి: అయితే నన్ను విడిచిపెట్టు.

సు: (వంగి, తన పొడవైన కత్తిని  చేతితో తడిమి చూసుకుంటూ) అపచారం చేస్తున్నారు మీరు. నేను కత్తిని నమ్ముకుని బ్రతికే వాణ్ణి.

త్రి: (ఒక్క సారి గక్కురు మని- వెనుకకు అడుగు వేస్తూ) అంటే, గొంతుకోసేవాడివన్నమాట.

(పెన్న గద్దే ఇతరులు ప్రవేశిస్తారు.  రంగస్థలం చివరనుండి  జరుగుతున్న విషయాలను పరికిస్తుంటారు)

సు:  మీ మనసును ఏదో పట్టి పీడిస్తున్నట్టు తోస్తోంది. మీరు ప్రతిరాత్రీ ఈ నిర్జన ప్రదేశానికి క్రమం తప్పకుండా వస్తున్నారు. నిజం చెప్పండి. ఏ స్త్రీ అయినా మీ ప్రేమను చూరగొందా?

త్రి: నాకు మాత్రమే సంబంధించిన విషయాన్ని ఇతరులతో చర్చించను.

సు: కానీ, నేను మీ క్షేమంకోరి చెబుతున్నాను. నే నెవర్నో తెలిస్తే ఇంతకంటే గౌరవంగా చూస్తారు. (గుసగుసలాడుతూ) ఒక వేళ మీ ప్రేయసి ఇంకొకరితో ప్రేమకలాపం వెలగబెడుతున్నాదేమోనని మీకు అనుమానం ఉండిఉండొచ్చు.

త్రి: ఓరి నీ.  నిన్ను పిశాచాలు పీక్కుతినా, నీకేం కావాలి?

సు: (చిన్న గొంతుకతో- అర్థమయ్యేలా చెయ్యి చూపిస్తూ)   కావాలంటే ఈ చెయ్యి వాడ్ని కైలాసానికి పంపేస్తుంది. కొంచెం ఖర్చవుతుంది. అంతే!

త్రి: (తనలో) హమ్మయ్య! బ్రతికేను.  (నిట్టూర్చును).

సు: ఈ సరికి నేనెటువంటి  గౌరవప్రదమైన పెద్దమనిషినో మీకు అర్థమయ్యే ఉంటుంది.

త్రి: కనీస అవసరానికైనా పనికి వస్తావని అర్థం అయింది.

సు: (తెచ్చిపెట్టుకున్న వినయంతో)

రాజ్యంలోని స్త్రీల మాన ప్రాణాలకు రక్ష!

త్రి: ఒక శార్గ్జ్ఞవుణ్ణి చంపాలంటే ఏం తీసుకుంటావో చెప్పు?

సు: అది చంపబోయే మనిషిని బట్టీ , దానిలో మేం చూపించే నైపుణ్యాన్నిబట్టీకూడా ఉంటుంది.

త్రి: అదే ఒక రాజవంశీకుడయితే?
సు: ఆరి దేముడో! కత్తితో కడుపులో పొడవాలంటే చాలా “రిస్క్” ఉంది.  వాళ్ళందరూ సాధారణంగా సాయుధులై ఉంటారు. వాళ్ళపై ప్రయత్నం అంటే, నా తొక్క నేను తాకట్టు పెట్టినట్లే.  రాజవంశీకుడయితే వెల చాలా ఎక్కువ.

త్రి: (నవ్వుతూ) రాజవంశీకుడి ధర అయితే అంత ఎక్కువ అంటున్నావు, మనలో మనమాట. మధ్యతరగతి వాళ్ళు ఏమైనా వాళ్ళని వాళ్ళు నరుక్కుంటారా?

సు: ఆహా! అక్షరాలా! కాని అది చాలా అరుదుగా జరుగుతుంది.  కేవలం గొప్పకుటుంబంలో పుట్టిన వాళ్ళకే ఈ క్రీడ. అయినా అక్కడక్కడ కొత్త ముఖలుంటాయి. (బొటకనవేలుతో మధ్యవేలును మీటుతూ) డబ్బు బాగా ఉంటుందనుకొండి. సందేహం లేదు. వాళ్లని చూస్తే నాకు జాలివేస్తుంది. గొప్పవాళ్ళని అనుకరిస్తూ వాళ్ళు నా సేవలు వినియోగించు కుంటారు .  సగం ముందు చెల్లిస్తారు. మిగతాది పని పూర్తయేక.
త్రి: అయితే కొరతవేస్తారన్న భయం కూడ లేకుండా దీనికి సిధ్ధపడ్డావన్నమాట.

సు: (తేలికగా తీసిపారేస్తూ): అబ్బే, అదేం కాదు. పోలీసులకి లంచమిస్తాం.
త్రి: తలకి ఇంత అనా?
సు: సరిగ్గా అంతే! అయితే ఒకటి తప్ప. ఏలా చెప్పాలి చెప్మా? ఆ! ఆ వ్యక్తి రాజుగారయితే తప్ప.

త్రి: మరి మీ పని ఎలా కానిస్తారు?
సు: నేనయితే నా పని ఇంట్లోగాని, రోడ్డుమీద గాని పూర్తిచేస్తాను.

త్రి: అంటే ఎలా?
సు: రోడ్డుమీదనయితే- చాలా పదునుగా ఉన్న కత్తిని ఉపయోగిస్తాను.  రాత్రి మాటు వేస్తాను.
త్రి: మరి ఇంటిదగ్గరయితేనో?

సు: దానిదేముంది. నా చెల్లెలు మొగలి సహాయం చేస్తుంది.  అది చాలా చక్కనైనది.  రాత్రివేళ డబ్బుకోసం  వీధిలో నాట్యం చేస్తూ, నవ్వుల వల వేసి- మా “లక్ష్యాన్ని” ఇంటిదారి పట్టిస్తుంది.  మా యింటికి రాగానే మట్టికరిపిస్తుంది.

త్రి: మరి చప్పుడూ, కేకలూ?

సు: అసలు గుట్టుచప్పుడుకాకుండా  అంతాజరిగిపోతుంది… చాకచక్యంగా, ఇంత పిసరు అనుమానం రాకుండా. నా మనవి ఏమిటంటే, నాకేదైనా పనుంటే అప్పగించండి.  మీకు సంతృప్తి కలిగేలా చేసిపెడతాను.  నాకు దుకాణం లేకపోయినా, కావలిసిన ప్రచారం లేకపోయినా, మిగతా వెధవల్లాగ  ఒక ప్రాణం తియ్యడంకోసం ఆపాదమస్తకం తొడుగులు వేసుకుని పదిమంది బయలుదేరే బాపతు కాదు.  పిరికి పందలు. వాళ్ళకత్తికన్నా కురచనైన ధైర్యంగలవాళ్ళు. (పొడవైన కత్తి ఒకసారి బయటకు తీస్తూ)  ఇదిగో, ఇదే నా ఆయుధం.

(త్రిభుల ఒక సారి నిర్ఘాంతబోతాడు)

సు: (నవ్వుతూ, శిరసు అవనతం చేస్తూ) మీ సేవకుడు.

త్రి: ప్రస్తుతం నీతో నాకు పని లేదు.

సు: అయ్యో! దురదృష్టం.  పోనీ లెండి. మీకు గాని పని తగిలితే, “డ్యూక్ ఆఫ్ మెయిన్” భవనం దగ్గర  నన్ను కలుసుకోవచ్చు.  ప్రతిరోజూ, మధ్యాహ్నం నేనక్కడ తిరగడానికి వస్తాను. నా పేరు సుల్తాన్.

త్రి: దేశద్రిమ్మరివా?

సు: నిషా ఇస్తాను కూడా.

దూరం నుండి  గద్దే: (పెన్న తో): ఆణిముత్యంలాంటి మనిషి. వాడి పేరు రాసుకుంటున్నా.

సు: నాగురించి చెడుగా అనుకోవటంలేదు గద!

త్రి: అబ్బే! ఏం? ఎందుకూ? అసలెందుకు తప్పుగా అనుకోవాలి? అందరూ బ్రతకాలి గదా!

సు: నేను బికారినీ, సోమరిపోతునీ, దొంగవెధవనీ కాలేక.   నాకు నలుగురు పిల్లలు.
త్రి: వాళ్ళకి తిండిపెట్టకుండా వదలివేయడం అనాగరికం. (అతన్ని వదిలించుకుందికి) వెళ్ళిరా!  దేముడు నీకు మేలు చేయుగాక!

(దూరంగా) పెన్న: (గద్దేతో) ఇక్కడ ఇంకా వెలుతురు బాగానే ఉంది.  మరికొంచెం చీకటి పడ్డాక వద్దాం పద. (ఇద్దరూ నిష్క్రమిస్తారు)

త్రి: (సుల్తాన్ తో  నిర్లక్ష్యంగా) సరే, ఉండు మరి!
సు: వీడు తమ సేవకుడు, మరిచిపోకండి. శలవు. (నిష్క్రమిస్తాడు)

త్రి: (అతను వెళ్ళిన దిక్కునే పరికిస్తూ)

అతని వృత్తికీ నా వృత్తికీ ఎంత సామ్యం ఉంది!

అతని కత్తి వాడియైనదే. కాని అంతకంటే పదునైన మాటలతో

గుండెలు గాయం చెయ్య గలను- అతని కత్తి కంటే లోతుగా.

(సశేషం)

రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం

(రంగస్థలి రెండు భాగాలుగా విడివడి “తెర వెనుక”  జరిగే విషయాలన్నీ  ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. )

ప్రథమాంకము   దృశ్యం 5

(రాజు, త్రిభుల, కాశ్యప, వేలరీ, తదితరులు)

వేలరీ: నామాట వినవలసిందే! నన్ను వద్దని శాసించే వారెవ్వరు?

రాజు: ( తేరుకుని) ఓహ్! మీరా, వేలరీ!

వే: అవును, నేనే!

(రాజు కోపంతో అతని మీదకు వెళ్లబోతుండగా త్రిభుల అడ్డుకుంటాడు)

త్రి: ప్రభూ! అతనితో సంభాషించడానికి  నాకు అనుజ్ఞ ఇవ్వండి.

(నాటక ఫక్కీలో నిల్చుని వేలరీతో)

స్వామీ! ఒకప్పుడు తమరే కదా, ఈ సింహాసనానికి  వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసింది.  అయినా ప్రభువులు తమకు సహజమైన ఔదార్యంతో  కనికరించి క్షమా భిక్ష పెట్టారు.  కాని ఇప్పుడు మిమ్మల్ని ఏ వెర్రి ఆవహించింది? (కాశ్యపను చూపిస్తూ) ఇంతవరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని మరుగుజ్జూ, కురూపీ, సంస్కార హీనుడూ, ముక్కుమీద బొడిపెలతో అందవికారంగా ఉన్న  అటువంటి ఆకారంనుండా మనుమల్ని ఆశిస్తున్నారు?  నా గూనిలాగే  వంకరవాడు అతను.  మీ కూతుర్ని అతని సరసను చూస్తే ఎవ్వరైనా నవ్వుకో వలసిందే!
ప్రభువులే కనుక  ఆదుకోపోతే, మీకు (కాశ్యపను చూపిస్తూ) అతనికంటే  అపూర్వమైన  నమూనాలవంటి మనుమలు కలిగి ఉండేవారు.  రోగిష్టులు, అనాకారులూ, కురూపులూ, అతనిలాగే పొట్ట ఉబ్బిపోయో…

(కాశ్యప ఆవేశంతో ఊగిపోతుంటాడు)

లేదా నాలాగ  గూనితోనో. అబ్బ! ఎంత రోత!
ఇకపై ప్రభువులు మీరు గర్వ పడేటటువంటి మనుమల్ని ప్రసాదిస్తారు.

మీ కాళ్లమీద తారంగం, తారంగం, మీ బవిరిగడ్డంతో ఆటలూ…
(త్రిభులను అభినందిస్తూ అందరూ చప్పట్లు కొడతారు)

వేలరీ:  ఇంతవరకూ జరిగిన అవమానాలు చాలక  మరొకటన్నమాట!
ప్రభూ! నామాట వినాలి! పాలితులు నివేదన చేస్తున్నప్పుడు  చెవి ఒగ్గి వినడం పాలకుల ధర్మం. నిజమే! మీ సార్వభౌమత్వం నన్ను వధ్యశిలకు  తీసుకువెళితే, అక్కడ మీ క్షమా భిక్ష నన్ను కలలా కమ్మేసింది.  అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాను కూడా… ప్రభువుల క్షమ  మృత్యువుకన్న  పదునైనదన్న సత్యం గ్రహించుకోలేక.   ఒక తండ్రిని రక్షించుకుందికి అతని తనయ తన శీలాన్ని  బలిచేసుకుంది.  ఔను! తరతరాలుగా మచ్చ ఎరుగని ఈ పాటియర్ వంశంపై- కనీసం అభిమానం గాని, గౌరవంగాని, జాలిగాని, విచారంగాని లేని నువ్వు, ఓ ఫ్రాన్సిస్, ఆ రాత్రి ఏం చేశావ్? నీ పానుపునే ఆమె శీలానికి సమాధిని చేశావు. నాకూతురు కోరుకున్నది భయం అంటే ఎరుగని , వేలెత్తి నేరం చూపించలేని (కాశ్యపను చూపిస్తూ) బయ్యార్డ్ లాంటి వ్యక్తిని.  నువ్వు మాయమాటలతో, అనురాగపు నటనలతో అమాయకురాలైన ఆమెను మోసపుచ్చావు.  తండ్రి ప్రాణాలను రక్షించుకుందికి  తపన పడిన ఆమెకు – హృదయంలేని రాజువి దొరికావు— కోరికను అనుగ్రహిస్తూ. తండ్రి ప్రాణాలకు ఒక నిర్దాక్షిణ్యమైన బేరం పెట్టావు.  అదిఘోరమైన వ్యాపార సరళి.  ఒక పెద్ద తప్పు చేసావు.

ఈ దేశంలోని మహామహుల్లో ప్రవహిస్తున్నట్టే- నా శరీరంలో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బొట్టూ నీదే! కాదనను.  ఈ బవిరిగడ్డాన్ని క్షమిస్తున్నట్టు నటించి, శోకతప్తయైన ఒక స్త్రీ  శీలాన్ని నిర్దాక్షిణ్యంగా కాలితో తొక్కేసేవే! అది చాలా హేయమైన పని.  తండ్రి నీ సేవకుడు. కాని, కుమార్తె కాదే! రారాజుల అధికార పరిధిని నువ్వు అతిక్రమించావు.  అయినా క్షమించావన్న కీర్తి నీకు. తిరుగుబాటు చేసానన్న అపప్రథ నాకు. నీవేగనుక నా మందిరం దరిదాపులకు వచ్చి ఉంటే, మోకాళ్ళపై ప్రణమిల్లి మరీ మృత్యువునే కోరుకునే వాణ్ణి. నా కుమార్తెకూ- నా జాతికీ- నా కీర్తికీ- క్షమ అంటే– ఛీ! ఒకసారి పంకిలమైన జాతి నాజాతి అనిపించుకోదు.  అవమానంతో సమానం.  నాకూ వాటికీ- ఋణం తీరిపోయింది.

నేనిపుడు ఆమెను నీదగ్గరనుండి తీసుకుపోడానికి రాలేదు. నీ దగ్గరే ఉండనీ. కళంకముద్రితమైన ఏ వస్తువునూ నీ దగ్గరనుండి తీసుకుపోను.  నీ ఆనందోత్సవాల మధ్య- ఏదో ఒకరోజు ఇది జరిగి తీరుతుంది.  ఏ తండ్రిదో- సోదరిడిదో- ఏ అభాగ్యుడైన భర్తదో-  హస్తం నీ వంశాంకురాన్ని, నీ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుందో-  అప్పటిదాకా నీతోనే ఉండనీ. నా విషణ్ణవదనం నిన్ను వెంటాడుతూ, నువ్వు చేసిన ఈ నీచకార్యాన్ని  నీకు పదే పదే గుర్తుచేస్తుండాలి. అది విని, న్యూనతాభావంతో, నీ అహంకారం నాముందు తల వాల్చాలి.  ఇక నువ్వు నీ సేవకులకు  నా శిరస్సు ఛేదించమని ఆజ్ఞ జారీ చెయ్యి.

చెయ్యగలవా? చెయ్యలేవు. ఎందుకంటే, అప్పుడు నా ఆత్మ తిరిగి వచ్చి నీకు హెచ్చరిక….

రా: ఉట్ఠి పిచ్చి ప్రేలాపన! (పెన్నతో) ఈ దేశద్రోహిని బందీ చెయ్యండి!

త్రి: (వెలరీని వెక్కిరిస్తూ) పాపం! అమాయకుడు! ఏదో వాగుతున్నాడు.

వేలరీ:   ఎలాగూ చనిపోతున్న సింహం కోసం ఒక విశ్వాసం గల కుక్కను బలిచేసుకోవడం తెలివి తక్కువ దనం. (త్రిభులవైపు తిరిగి) నువ్వు ఎవరో నాకు తెలియదు.  ఎవరయితేనేం!  నీకు నా కన్నీళ్ళు ఒక ఆటగా, ఒక వ్యావృత్తిగా మారింది.  హేయమైన అపహాస్యాలూ- విషసర్పం కంటే పదునైన కోరలూ ఉపయోగిస్తున్నావు. ఇదే నాశాపం!

(రాజు తో)  నీ మకుటంలో ఈ దేశంలోని అపురూపమైన మణులు పొదిగి ఉన్నాయి.  నానుదుట ముదిమి, శిరస్సు మీద పలిత కేశాలూ ఉన్నాయి.  అయినా చెరొక కిరీటాన్నీ ధరించి, ఇద్దరమూ రాజులమే.  ఒకవేళ ఒక అపవిత్ర హస్తం  నీకు అపచారం చేసినా, అవమానం చేసినా, నీ భుజబలంతోనే దానికి ప్రతీకారం తీర్చుకో యత్నింతువుగాక! నాకు జరిగిన అవమానాలకు  భగవంతుడే ప్రతీకారం చేస్తాడు

(వేలరీని భటులు ఈడ్చుకుని వెళ్ళిపోతారు)

(ప్రథమాంకం సమాప్తం)

రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 4 వ భాగం

ప్రథమాంకము            దృశ్యం 4

[ఫ్రాన్సిస్,  త్రిభుల ప్రవేశం)

త్రి: రాజసభకు మేధావులా? ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదు.

ఫ్రా: అయితే పోయి చెప్పుకో.  మా సోదరి సలహా మండలిని మేధావులతో  నింపాలని యోచిస్తున్నది.

త్రి: ఇది మనలో  మన మాట. నేను మీ కంటే తక్కువ తాగేనని ఒప్పుకుంటారు గదా.  కాబట్టి మనిద్దరిలో  నాకు ఈ విషయం  అన్ని కోణాలూ, రూపాలూ, వర్ణాలూ చర్చించి, నిర్ణయించే అధికారం ఉంది. నాకు ఒక ఆధిక్యత ఉంది. అట్టే మాటాడితే రెండు ఉన్నాయి. మొదటిది నేను తక్కువ తాగడం. రెండోది– నేను రాజుని కాకపోవటం. మీ సలహా సంఘంలో మేధావుల్ని రమ్మనమనే కంటే,  కరువునూ, మహమ్మారినీ పిలుచుకు రండి.

ఫ్రా: మరి మా సోదరి సలహామండలిని మేధావులతో నింపడానికే నిర్ణయించుకున్నదే!

త్రి: అది ఒక సోదరికి కూడని పని. నన్ను నమ్మండి ప్రభూ! ఈ విశాల జంతు ప్రపంచంలో  మేధావిగా చలామణీ అయ్యే వ్యక్తి కంటే  హీనమైనదీ, నికృష్టమైనదీ, ఎక్కడా కనిపించదు. ఒక జిత్తులమారి తోడేలు గాని, నక్క, కాకి, కుక్క, అన్నార్తుడైన కవి,  విశ్వాసఘాతకుడు, గుడ్లగూబ, ఎలుగుబంటి, సోమరిపోతు ఎవరైనా,  వాడిలో సగానికి కూడా సాటిరావంటే నమ్మండి.  మీకు సుఖంలేదా? దండయాత్రలు లేవా? సర్వం సహాధికారం లేదా? అన్నిటినీ మించి కాంతులీనుతూ, సుగంధపరిమళాలు వెదజల్లే మనోహారిణులైన  సుందరీ మణులకు కొదవా?

ఫ్రా: ఒకరోజు రాత్రి మార్గరెట్ నా చెవిలో— స్త్రీల చెలిమి నన్ను కలకాలం కట్టిపడేయలేదని చెప్పింది. ఏదో ఒకరోజు  విరక్తి కలుగుతుందట.

త్రి: చిత్రమైన చికిత్సే.  విరక్తహృదయాలకు మేధోల్లసనం! వాహ్!  ప్రభూ! ఆమె ఎప్పుడూ  విపరీత మైన చికిత్స చేస్తానంటే, మీరు నమ్ముతారనుకుంటా.

ఫ్రా: అయితే నాకు మేధావులక్కరలేదు.  ఐదుగురో, ఆరుగురో  కవులు చాలు.

త్రి: నేనే రాజునయితే, పాపాత్ముల్ని పవిత్రుల్ని చేసే గంగాజలాన్ని యమభటులు ద్వేషించిన దానికంటే కూడా ఎక్కువగా కవుల్ని ద్వేషిస్తాను.

ఫ్రా: కేవలం  ఐదుగురో, ఆరుగురో…

త్రి: అబ్బో, అదే చాలు. ఒక గుర్రాలశాల పెట్టు. నిజానికి ఒక జంతుప్రదర్శన శాలే! మనం ఇప్పటికే మరువీచి ప్రతాపం చూస్తున్నాం…వాడి అంత్యానుప్రాసలు భరించలేక చస్తున్నాం.

(తెర వెనుక నుండి)

మరువీచిక: కృతజ్ఞుణ్ణి.
(తనలో) ఈ మూర్ఖుడు నోరు మూసుకోగలిగి ఉంటే వాడంత తెలివైనవాడు మరొకడుండకపోను.

(తెర ముందు)
త్రి: ప్రభూ అందాన్నే మీ స్వర్గంగా కొనసాగనియ్యండి.  ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతం చెయ్యగలిగేది సూర్యుడే. ఈ పుస్తకాలతో మీ బుర్ర పాడుచేసుకోకండి.

ఫ్రా: లేదు. లేదు. నిజానికి ఆపిల్సు ఆంటే చేపలకు ఎంత ఇష్టమో, నాకు పుస్తకాలంటే అంతే.

(ఇంతలో తెరవెనుక నుండి నవ్వులు వినిపిస్తాయి)

త్రిభులా! వాళ్ళు నీ గురించే చెప్పుకుని నవ్వుకుంటున్నట్లున్నారు.

(ఆ దిశగా వెళ్ళి- వాళ్ళ మాటలు చెవి ఒగ్గి విని, వెనుదిరుగుతాడు)

వాళ్ళు ఇంకో మూర్ఖుడి గురించి మాటాడుకుని నవ్వుకుంటున్నారు.

ఫ్రా: ఎవరు?

త్రి: ఇంకెవరు? ప్రభువులే!

ఫ్రా: వాళ్ళేమంటున్నారు?

త్రి: వాళ్ళు మిమ్మల్ని పిసినారి అంటున్నారు. సంపదలు రాజ్యాన్ని విడిచిపోతున్నా, తమ చేతులకు ఏమీ అంటటం లేదని వాపోతున్నారు.

ఫ్రా: వాళ్ళను ఇక్కడనుండే పోల్చుకోగలను… మధునిష, బహుగుణ, మాతంగ. అవునా?

త్రి: అవును.

ఫ్రా: కృతఘ్నులు. విశ్వాసం లేని కుక్కలు. అందులో ఒకడిని జలసేనాధ్యక్షుడ్ని చేసాను.  ఒకర్ని దేశానికే అత్యున్నతపోలీసు జనరల్ ని చేశాను. మాతంగ ను మా ఇంటికే “మాస్టర్”ని చేశాను. అయినా ఇంకా గునుస్తున్నారు.

త్రి: అవి చాలవు. వాళ్లకు  మీరు తక్షణం చెయ్యవలసింది ఇంకొకటి ఉంది. అది తక్షణమే చేసెయ్యండి.

ఫ్రా: ఏమిటది?

త్రి: ఉరి తీయించడమే!

(తెర వెనుక నుండి అదే సమయంలో)

ఫెన్న:   (త్రిభుల వైపు చెయ్యి చూపిస్తూ, మాట్లాడుతున్న ముగ్గురితో) విన్నారా వాడి మాటలు?

బహు: ఆహా!

మధు: వాడు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాడు.

(తెర ముందు)

త్రి: (రాజుతో) బాధామయమైన  శూన్యం మీ హృదిని వేదిస్తూ ఉండి ఉంటుంది. అందులోనూ. ఇంతమంది అందగత్తెలలో, ఏ ఒక్కరి కనులూ మిమ్మల్ని నిరాకరించలేకపోయినా, ఒక్క మనసైనా మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలిస్తే…

ఫ్రా: ఆ విషయం నీకెలా తెలుసు?

త్రి: ప్రభూ! అమాయకత్వం మొగ్గ విడుతున్నప్పుడు కలిగేదే నిజమైన ప్రేమ. ఆ స్థితి దాటిన తర్వాత చూపించే ప్రేమ – ప్రేమ కాదు.

ఫ్రా: అంటే, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీని వెదుక్కో లేకపోయేననేనా  నీ అభిప్రాయం?

త్రి: తమ హోదా తెలియనిది ఎవరికి గనుక?

ఫ్రా: (తల పంకిస్తూ) అవును. ఎవరికి తెలియదు గనుక.  (తనలో) అలా అయితే- బుస్సీ భవనంలో నా చిన్నారి ప్రేయసి విషయం చెప్పను.

త్రి: (ఏదో విషయం ఉందని పసి గట్టి) ఒక సామాన్య స్త్రీ?

ఫ్రా: ఏం? కాకూడదా?

త్రి: (ఆందోళనతో) అయితే బహుపరాక్! మీప్రేమ  ఊహించరాని ప్రమాదాల మధ్య ప్రయాణం చేస్తోంది.  ఈ ప్రజలకి కోపం వస్తే, రోమన్ల వలె వెర్రెక్కిపోతారు.  ప్రాణాలు తాకట్టుపెట్టయినా తమ వస్తువుల్ని విడిపించుకుంటారు.  తమబోటి ప్రభువులు, నాబోటి బంట్లు, మన స్నేహితుల అందమైన భార్యలతోనూ, చెల్లెళ్లతోనూ సంతృప్తిచెందవలసిందే!

ఫ్రా: నా ఉద్దేశ్యంలో కాశ్యప భార్య నాకు బాగా  నప్పుతుందనుకుంటాను.

త్రి: అలాగయితే ఆమెను వరించండి.

ఫ్రా: చెప్పడం సులువు. చెయ్యడమే కష్టం.

త్రి: ఈ రాత్రికే ఆమెను కిద్నాప్ చేద్దాం.

ఫ్రా: ఈర్ష్యాళువైన ఆమె భర్త?

త్రి: ఏదో మిష మీద వాడిని జైలుకి పంపించెయ్యండి.

ఫ్రా: ఓహ్! లాభం లేదు.

త్రి: పోనీ నష్టం భర్తీ చెయ్య డానికి – అతనికి ఒక పదవి పారేయండి.

ఫ్రా: అలా అయినప్పటికీ,  అసూయతో ఎదురు తిరిగి- ఇంటికప్పులెక్కి మరీ అరుస్తాడేమో?

త్రి: హు! ఈ మనిషితో కొన్నా కష్టమే! కసిరినా కష్టమే!

(త్రిభుల మాట్లాడుతుండగా కాశ్యప వచ్చి మిగతా సంభాషణ అంతా చాటుగా వింటాడు)

అయితే దానికి ఒక చిన్న  సులభమైనదీ, సూక్ష్మమైనదీ ఒక ఉపాయం ఉంది.  దాన్ని ముందే  ఎందుకు ఊహించలేకపోయానా అని నాకే ఆశ్చర్యం వేస్తోంది. వాడికి శిరఛ్చేదం చేయించండి.
(కాశ్యప ఒక్క సారి గతుక్కు మని , వెనక్కి ఒక అడుగు వేస్తాడు.)
అతడ్ని ఏదో ఒక నేరంలో ఇరికించండి. శత్రువులకు సాయం చేస్తున్నాడని  ఏదో కుట్రలో భాగస్వామిగా చూపించండి.

కాశ్యప: (ముందుకు వచ్చి  వింటాడు) కార్చిచు వెధవ!

ఫ్రా: (త్రిభులతో) లాభం లేదు. ఆ తల అలా తియ్యడం వీలవదు. ఇంకేదైనా ఆలోచించు.

త్రి: ఏమిటీ! ఒక రాజ్యాధినేత అయి ఉండి, అంతలోనే మనసు మార్చుకోవడమా? ఇంత చిన్న విషయం చెయ్యలేని పనా?

(ముందుకు వచ్చి )

కాశ్యప: (త్రిభులతో) నీకు కొరడా వేయిస్తాను.

త్రి: నువ్వంటే నేనేం భయ పడను.  ఈ చుట్టూ ఉన్న వాళ్లందరితోనూ వాగ్యుధ్ధం చెయ్యగలను.  నాతల మీద ఈ కుచ్చు టోపీ  ఉన్నంతకాలం  దేనికీ భయపడను. నా గూని వెనక్కి బదులు ముందుకివచ్చి నీలాగ అయిపోతే మాత్రం,  నేను అసహ్యంగా కనిపిస్తానని భయపడతాను.

కాశ్యప: (పట్టరాని కోపంతో కత్తి దూస్తూ) సభ్యత తెలియని బానిస!

ఫ్రా: శాంతించండి! స్వామీ! శాంతించండి. నాతో రా!
(ఫ్రాన్సిస్, త్రిభులను తీసుకు పోయిన తర్వాత తెర వెనుక నుండి అందరూ ముందుకి వస్తారు)

బహు: ప్రతీకారం! త్రిభులపై పగ తీర్చుకోవాలి.

మరు: లాభంలేదు. అతనికి రక్షణ కవచం చాల బలంగా ఉంది. ఎలా దెబ్బ తీస్తాం? అసలెక్కడ దెబ్బ కొట్టగలం?

పెన్న: ఆ పథకం నా దగ్గర ఉంది… మనందరికీ జరిగిన అన్ని అవమానాలకీ ప్రతీకారం తీర్చుకునే ఉపాయం.  చీకటి పడగానే అందరూ సాయుధులై నన్ను కలవండి. … బుస్సీ భవనపు వెలుపలి గోడ దగ్గర…కాశ్యప ఇంటి గేటు సమీపంలో. ఇంకేవివరాలూ నన్ను అడగవద్దు.

మరు: నీ పాచిక నేనూహించగలను.

పెన్న: నిశ్శబ్దం. అతను వస్తున్నాడు.

త్రి: (తనలో) ఇప్పుడు ఎవరిని మస్కా కొట్టాలి? రాజుగారినా? అబ్బో! అదే జరిగితే భలే మజాగా ఉంటుంది.

(ఇంతలో ఒక రాజసేవకుడు వచ్చి త్రిభుల చెవిలో ఏదో చెబుతాడు)

సేవకుడు:(ప్రకాశముగా)  శ్రీ వేలరీ, విషాదంలో మునిగి ఉన్న ఒక పండు ముదుసలి.  ప్రభువుల దర్శనార్థం వేచి ఉన్నారు.

త్రి: (తనలో) ఈ పిశాచమా! (ప్రకాశముగా) ఓ! తప్పకుండా! శ్రీ వేలరీ గారిని దర్శించడానికి ఉత్సుకతగా ఉందని చెప్పు. (సేవకుడు నిష్క్రమించును)

(తనలో) అద్భుతం! ఈ జోకు ముందు  మిగతావన్నీ దిగదుడుపే!

(ద్వారం దగ్గర ఏదో గందరగోళం,  కలకలం  వినిపిస్తుంది)

(బయటనుండి ఒక గొంతు): ప్రభువులను దర్శించాలి!

ఫ్రా: (స్త్రీలతో సరస సల్లాపాల మధ్య)  ఎవరది లోనికి రావడానికి సాహసిస్తున్నది?

(బయటనుండి ఒక గొంతు): ప్రభువులను దర్శించాలి!

ఫ్రా: వీలు పడదు. వీలు పడదు.

ఇంతలో ఒక పండు ముదుసలి – బవిరిగడ్డం -నెరసిన జుత్తుతో స్టేజి వెనుకనుండి  అందర్నీ తోసుకుంటూ ముందుకి వచ్చి – రాజు ఎదురుగా నిలిచి- కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు.

(సశేషం)

రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 3 వ భాగం

ప్రథమాంకం  దృశ్యం 3

(ముందుగా గద్దే, పార్థివన్, విస్సు, మరువీచి ప్రవేశిస్తారు.  తర్వాత నెమ్మదిగా పెన్న, కాశ్యప ప్రవేసిస్తారు. ఒకరికొకరు అభివాదం చేసుకుంటారు)

పెన్న: ఉదాత్త మిత్రవర్యులారా!మీకొక కొత్త విషయం చెప్పబోతున్నాను. లేదు. ముందుగా మీ మేధాశక్తికి పరీక్ష. మీకొక చిక్కు ప్రశ్న. మీరే ఊహించండి. అనూహ్యమూ,   అద్భుతమూ, ఐన ఒక ప్రేమ కథ.   తల్చుకుంటే నవ్వొస్తుంది. జరగడానికి అవకాశంలేనిది….

గద్దే: ( కుతూహలం ఆపుకోలేక) ఏమిటది?

మరువీచి: తమకేమి కావాలో?

పెన్న: మరువీచీ! నే చెబుతున్నా విను.  నిన్నుపోలిన పరమ మూర్ఖుడు ఇంకొకడు ఉండడు.

మరు: పరమ మూర్ఖుడనా?  నాగురించి నేనెప్పుడూ అంతకంటే భిన్నంగా ఊహించటంలేదే!

పెన్న: కాకపోతే మరేమిటి?  నీ సరికొత్త కవితలో  త్రిభుల గురించి ఏమని రాసావు?  హేళనకు ఎంపిక చేసిన ఏకైక వ్యక్తి– అతణ్ణి “మూడుపదుల వయసులో- సంజవెలుగును బోలిన సంసార వంతుడ”ని చెప్పలేదూ?  అతడు కాదు. నువ్వే మూర్ఖుడివి.

మరు: నీతో నేను భేటీ వేసుకుంటే, మరుడు నన్నేమరు గాక!

పెన్న: ఓ గద్దే! విను.  పార్థివన్ గారూ, మీరు కూడా.  మిమ్మల్ని  ఊహించమని ప్రార్థిస్తున్నాను.  త్రిభులకు ఏదో ఒక వింత సంఘటన జరిగింది. అది ఏమిటి?

పా: అతని గూనిగాని పోయిందా?

కాశ్యప: కొంపదీసి ఈ నగరానికి అతణ్ణి పోలీసు కమిషనర్ గా వెయ్యలేదు కద!

మరు: ఒకవేళ తనే వండి ప్రభువులకు వడ్డించాడేమో!

పెన్న: (నవ్వుతూ) అంతకంటే నవ్వు తెప్పించేది. అతనికి … ఒక… (నవ్వుతో వగరుస్తూ)  మీరు ఊహించలేరు. అసలు నమ్మశక్యం కానిది.

పా: అతనిప్పుడున్న దానికంటే అనాకారి, కురూపిగా  మారిపోయాడేమో!

మరు: దాహంతో పిడచగట్టుకుపోయే అతని జేబు ఇప్పుడు బంగారు నాణేలతో గాని నిండిపోలేదు కద!
కాశ్య: కేకులు చెయ్యడానికి పంపలేదుకద!

మరు: స్వర్గంలో దేవుని సేవకు నియమించలేదు గద!

గద్దే: బహుశా ఏదైనా ప్రాణి ….

పెన్న: లాభం లేదు. మీరు లక్ష్యాన్ని ఛేదించలేరు. ఒక బఫ్ఫూన్…  త్రిభుల …కురూపి… అనాగరికుడు… వాడికి… వాడికి…  ఏమిటి ఉందో ఊహించండి… అమానుషం!  ఊహించండి!

మరు: వాడి గూని…

పెన్న: అబ్బే! ఇక లాభంలేదు.  వినండి… వాడికున్నది…. ఒక … ప్రియురాలు…
(అందరూ పగలబడి నవ్వుతారు)

మరు: సంస్థానాధీసుల తెలివి— లక్ష్యాన్ని  దాటిమరీ దూసుకుపోతోంది.

గద్దే: ఇది చాలా చచ్చు జోకు.

పెన్న: హాస్యం కాదు. నిజంగానే. నామీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. కావాలంటే మిమ్మల్నందర్నీ అతని ప్రియురాలి ఇంటిద్వారం వరకు తీసుకు వెళ్ళగలను.  ప్రతి రోజూ– నల్లటి ముసుగులో– వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు– ఆకలిగొన్న కవిలా –  ప్రవేసిస్తాడు.  నాకైనా ఒక రోజు చాలా కాకతాళీయంగా- కాశ్యప ఇంటిముందు బెదురు చూపులు చూస్తూ కనిపించాడు.  ఇక ఈ విషయాన్ని మీలోనే దాచుకొండి.  వాడి పని పట్టడానికి నా దగ్గర ఒక పథకం ఉంది.

మరు: అయితే ఒక చిన్న గీతిక…
త్రిభుల ఇక మన్మధుడిగా మారిపోయాడు
కాని, ఫర్వాలేదు. నాకింకా ధైర్యంగానే ఉంది.
ఇక ఏ శత్రు రాజు దేశం మీదకి దండెత్తినా
ఆయుధాలు దేనికి?  త్రిభులప్రేయసి ముఖం చాలదూ
వాళ్ళు తోకముడిచి పారడానికి?
(అందరూ నవ్వుతారు. ఇంతలో విస్సు ముందుకి వస్తాడు. పెన్న తన పెదాలపై వేలుంచి నిశ్శబ్దం సూచిస్తాడు.)

పెన్న: దొరలందరికీ విన్నపం.  నిశ్శ బ్దం పాటించండి.

పార్థి:  ఏదో ప్రేమలో పడ్డ వ్యక్తిలా – ప్రభువులు ఎందుకు రోజూ రాత్రిపూట  ఒంటరిగా సంచారం  చేస్తుంటారు?

పెన్న: (విస్సు నుద్దేశిస్తూ) ఆ విషయం విస్సు మనకి విశ్దం చేస్తారు.

విస్సు:        నిలకడలేని అతని మనసు- ఇపుడు ఎవరూ గుర్తించలేని విధంగా
ఆహార్యం మార్చుకుని తిరగాలని- మారువేషాలవైపు మరలింది.
ఒకవేల చీకటి ముదిరి- గవాక్షాన్ని ద్వారంగా భ్రమపడితే?
అయినా — పెళ్ళికాని వాడిని– అది నాకు సంబంధించని విషయం.

కాశ్య:       ఇక ఎవరికైనా – పెళ్ళాం లేదు- చెల్లీ లేదు- పిల్లా లేదు-
రాజుగారు అనుభవించాలనుకుంటే-  సుఖాన్నిఇతరులనుండి దోచుకుంటారు
అతని సుఖంకోసం- ఇవతలి వాళ్ళు వెతలపాలవుతారు.
ఆ నవ్వే నోటిలో ఉన్నవి- దంతాలు కాదు- సూటిగా నాటుకునే కోరలు

విస్సు: (పెన్న, మరువీచిలతో)  అతను రాజుగారి పేరు చెబితే చాలు- ఊగిపోతాడు.

పెన్న: (తనలో) అతని సొగసులాడి భార్యకు మాత్రం – ఇంత పిసరు భయం లేదు.

మరు: (తనలో) అదే కదా- అతన్ని భయానికి గురిచేసే విషయం.

గద్దే: (ప్రకాశంగా)  మీరు పొరపడ్డారు కాశ్యప!  రాజుగారిని చలాకీగా హుషారు ఉంచవలసిన బాధ్యతా, ఉదాత్తుడిగా తీర్చిదిద్దవలసిన బాధ్యతా- రాజపరివారానిదే!

పెన్న: సత్యం! విషాదంలో మునిగిపోయిన ప్రభువూ, తోకముడిచిన వసంతం, లేదా- శోక శైశిరం ఒకటేనని నా అభిప్రాయం.

(వీరు ఇలా మాట్లాడుకుంటుండగా దృశ్యం మారుతుంది. )

(సశేషం)

రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 2 వ భాగం

ప్రథమాంకము — దృశ్యం 2

[ఫ్రాన్సిస్, త్రిభుల, గద్దే, ఇతర ప్రముఖులు ప్రవేశం. అందరూ చక్కని ఆహార్యంలో  ఉంటారు. త్రిభుల మాత్రం విదూషకుడి వేషధారణలో. ఫ్రాన్సిస్ అక్కడున్న స్త్రీలను మెచ్చుకోడానికి వెళుతుంటాడు.]

లాతూరు: శ్రీమతి ఇందిర ఈరోజు దేవకాంతల్ని సైతం మైమరపిస్తోంది.
గద్దే: నాకు అర్బుద, వినీల జంట నక్షత్రాల్లా కనిపిస్తున్నారు.
ఫ్రాన్సిస్: కానీ, శ్రీమతి కాశ్యప  ముగ్గుర్నీ తలదన్నేట్టుగా ఉంది.
గ: (శ్రీ కాశ్యపను చూపిస్తూ- అతను ఫ్రాన్సులోని నలుగురు మహాకాయులలో ఒకడని గుర్తుచేస్తూ) కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఆమె భర్త వినగలడు.
ఫ్రా: ఆ మాటకొస్తే నేనెవర్నీ లక్ష్యపెట్టను.
గ: అతనావిషయం పోయి డయానా సుందరికి చెబుతేనో?
ఫ్ర:  చెప్పనీ.  చెబితే నాకేం? (రాజు వేదిక చివరనున్న స్త్రీలతో సంభాషించదానికి వెళ్తుంటాడు.)
త్రిభుల: (గద్దేతో) రాజుగారు డయానాకు కోపం తెప్పిస్తారు.  ఎనిమిది రోజులయింది, రాజుగారు ఆ సుందరితో మాట్లాడి.

గ: రాజుగారు అలాగయితే ఆమెను ఆమె భర్త దగ్గరికి పంపేస్తారంటావా?
త్రి: నిజానికి, అలాజరగదని నేను భావిస్తున్నాను.
గ: ఆమె తన తండ్రి జీవితానికి ప్రతిగా — చాలా  పెద్ద మూల్యమే చెల్లించింది.

త్రి: వేలరీ చాలా చిత్రమైన మనిషి.  లేకుంటే, తనకూతుర్ని, కాదు కాదు, ఒక కాంతిపుంజాన్ని, ఈ లోకాన్ని అనుగ్రహించడానికి సాక్షాత్తూ స్వర్గం నుండి దిగివచ్చిన  దేవకన్య లాంటి డయానాని- కేవలం సేవకమాత్రుడైన ఒక గూని వాడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడా?

గ: అతను ఒక మతిలేని ముదుసలి. పాలిపోయి ముడతలు బారిన శరీరం అతనిది.  ప్రభువులు క్షమాభిక్షపెట్టినపుడు,  నేను మీకున్నంత దగ్గరగా ఉన్నాను.  “రాజును ప్రభువు క్షమించుగాక!” అని మాత్రమే అన్నాడు.  ఇపుడు, ఆ మాత్రం మతిస్థిమితం కూడా లేదు. పూర్తిగా పిచ్చివాడయిపోయాడు.

(రాజు ఆ సమయంలో శ్రీమతి కాశ్యపతో ముచ్చటిస్తూ  వెళుతుంటాడు)

రా: ఇంతలోనే దేవిగారికి ఈ దీనుడిపై  అంత కినుకా?

శ్రీమతి కాశ్యప: మావారు నన్ను విదేశాలకు తీసుకు వెళుతున్నారు.

రా:    అది మహా పాపం! ఈ రాజ్యం నీ పోకను నిషేధిస్తున్నాది. నువ్వు ఇక్కడనుండి కదలడానికి వీలులేదు.  నీ లేమి, ఈ సామ్రాజ్యంలో  సభాసదుల్నీ, వాళ్ళమేధస్సునీ, అపురూపంగా దాచుకున్న కోరికల్నీ నీరుగార్చెస్తుందే! ఇక్కడ కవులూ, శార్గ్జ్ఙపాణులూ, నిత్యమూ నీకోసమే తమ తమ ఆలోచనలనూ, ఆయుధాలనూ, ఉదాత్తంగా, పదునుగా ఉంచుకుంటారే!ప్రతిహృదయాన్నీ  దోచుకోగల నీ చూపుల తూపులు, ప్రతి సుందరినీ తన ప్రియుడ్ని జాగ్రత్తగా కాపాడుకోమని హెచ్చరిక చేస్తాయే! ఈ సభా మంటపాన్ని  దివ్యమణులకంటే  కాంతిమతంచేసే సుందరీ! నీ ముఖారవిందం కనుమరుగైతే దినంలో దివం ఏదీ? ఈ రాజునీ, మంత్రిపుంగవుల్నీ, రాయబారుల్నీ, రాకుమారుల్నీ ఇంతమంది రాజ్యాధికారుల్నీ  త్రోసిరాజని ఓ రాజ్య రత్నమా! ఎక్కడో ఒక అనామక దేశంలో, ఒక కుగ్రామంలో, వెలుగులీనడానికి నీ మనసు ఎలా సమ్మతించింది?

శ్రీమతి కాశ్యప: కాసేపు మీ వర్ణనలు తగ్గించరాదూ…

రా: ఒకానొక దుష్ట శక్తి తన  హస్తంతో ఆనందోత్సవాల కేరింతలతో నడయాడే నాట్యకేళీమటపంలోని షాండిలియర్స్ ని మంచి రసవద్ఘట్టంలో త్రెంపివేసినట్టు….

శ్రీ.కా.: అడుగో… అప్పుడే… అనుమానం మొగుడు.

(అని వారి వద్దకు రాబోతున్న తన భర్త రాకను సంజ్ఞ చేసి తొందరగా అక్కడనుండి నిష్క్రమించును)

రా: వీడ్ని పిశాచాలు పీక్కుతినా! (త్రిభులవైపు తిరిగి)
కానీ, వీడి భార్యమీద నేను కవిత్వం రాసాను. అందులోని చివరి వాక్యాలు మరువీచిక చూసాడా?

త్రి: ప్రభువుల కవిత్వం నేనెపుడూ చూడలేదు. రాజుల ‘పల్లవులు ‘ ఎప్పుడూ బాధామయాలే!

రా: శభాష్!

త్రి:  మందలోని కవుల్ని ప్రాసకోసం ప్రేమా- దోమా- అని వాడనీయండి ప్రభూ!  అది వాళ్ళ వృత్తి.  రారాజులు- అందాన్ని  అనునయించడానికి వేరొక పంథా అనుసరిస్తారు.  ప్రేమించండి! ప్రేమని అనుభవించండి ప్రభూ! కవిత్వం రాసుకోవడం మరువీచికలాంటివాళ్ళకు వదిలేయండి. అది మీకు కాని పని.

రా: (శ్రీమతి కాజల్ ని చూసి, త్రిభులని వీడి, ఆమెవైపు పోతూ, త్రిభులతో)

శ్రీమతి కాజల్ తనవైపు నన్ను ఆకర్షించి ఉండకపోతే, నిన్నీపాటికి కొరతవేయిద్దును.

త్రి: (తనలో) అప్పుడే మరొక స్త్రీ. గాలికంటే చంచలంగా నీ మనసు ఆమెవైపు పరిగెడుతోందే!

గద్దే: (త్రిభులను సమీపిస్తూ) రెండో ద్వారం గుండా శ్రీమతి కాశ్యప వస్తోంది. నామెద ఒట్టు వేసి చెప్పగలను. ఆమె ఒక సంకేతాన్ని జారవిడుస్తుంది.  విషయాశక్తుడైన రాజు దాన్ని  తప్పక గ్రహిస్తాడు.

త్రి: అలాగయితే మనం కొంతసేపు నిరీక్షిద్దాం.

(శ్రీమతి కాశ్యప తన పూలచెండుని జారవిడుస్తుంది)

గ: నే చెప్పలేదూ?

త్రి: ఆద్భుతం!

(రాజు కాజల్ ని విడిచిపెట్టి, పూలచెండుని తీసి శ్రీమతి కాశ్యపకి తిరిగి అందిస్తూ, ఆమెతో సహజంగా- ఆత్మీయమైన సంభాషణలోకి దిగుతాడు)

గ: పిట్ట మళ్ళీ వల్లో పడింది.

త్రి: భూతాలలో పెనుభూతం స్త్రీ యే!

(రాజు  శ్రీమతి కాశ్యప చెవిలో  ఏదో సంభాషిస్తాడు.  ఆమె నవ్వుతుంది. ఆమెను అతను నడుం మీదచెయ్యివేసి పొదివి పట్టుకుంటాడు. ఇంతలో రంగస్థలి వెనుకనుండి శ్రీ కాశ్యప ప్రవేశిస్తాడు. గద్దే ఈ విషయాన్ని త్రిభులకు చూపిస్తుంటాడు)

గ: అడుగో, ఆమె భర్త.

(శ్రీమతి కాశ్యప  ఇంతలో తన భర్త రాకను గమనించి, రాజుగారి చెయ్యి విదిల్చుకుని, తొందరగా నిష్క్రమించ ప్రయత్నిస్తుంది)వదలండి!

త్రి: ఓహో! అసూయ అతని ప్రక్కలు ఎగదోస్తోంది.  భ్రుకుటి ముడుతలువేస్తోంది.

(ఇంతలో రాజు దగ్గరికి పానీయాలు రావడంతో, ముందుకు వస్తాడు)

రా: ఆహా! ఎంత ఆనందసమయం!  (ఆనంద పారవశ్యంలో) బృహస్పతి, భీమసేనుడూ ఎందుకు పనికివస్తారు నాముందు. ప్రపంచానికి వన్నెతీసుకు రాగలిగింది స్త్రీలే! నాకిపుడెంతో ఆనందంగా ఉంది.

(త్రిభులతో) మరి నీ సంగతేమిటి?

త్రి: అంతటా సంతోషం వెల్లి విరుస్తోంది.  నాకిలాంటి విందులు, వినోదాలు, దర్పాలూ, తెలివితక్కువలూ, మలిన ప్రేమలూ చూస్తుంటే, మీకు ఆనందం కలిగింఛవచ్చేమో గాని, నాకు నవ్వు వస్తుంది. మీరు ఆనందిస్తుంటే నాకు చికాకు కలుగుతుంది. ఐనా ఇద్దరికీ సుఖమే. మీరు రాజుగా ఆనందిస్తుంటే నేను గూనివాడిగా ఆనందిస్తాను.

ఫ్రా: కాశ్యప ఆనందపు పాలపొంగు మీద నీళ్ళుజల్లుతాడు. అయినా, జరిగేది జరగనీ. (ఆ ప్రదేశాన్ని  విడిచిపెడుతున్న కాశ్యపను చూపిస్తూ) అతని మీద నీ అభిప్రాయం ఏమిటి?

త్రి: మూర్ఖాగ్రేసరుడు.

ఫ్రా: ఈ ముసలి గుండ్రాయి భూస్వామి బాధించినంతగా ఇంకేదీ బాధించడం లేదు. నాకు చెయ్యడానికీ కోరుకుందికీ అనుభవించడానికీ అధికారం ఉంది.  కానీ, త్రిభులా! బ్రతికి ప్రయోజనం ఏమిటి? సుఖం ఏదీ?

త్రి: ప్రభూ! మీరు కాస్త అధికంగా సేవించినట్లున్నారు.

ఫ్రా:  కానీ మద్యం కాదు.  అక్కడకనిపిస్తున్నాయి చూడు. ఓహ్! ఏమి చేతులు!  ఏమి అధరాలు!! ఆహ్! ఏమి కన్నులు!!!

త్రి: ఎవరు? శ్రీమతి కాశ్యపవా?

ఫ్రా: రా! మాతో పరికించుదువు గాని.

( స్త్రీలను చూస్తూ తన్మయత్వంలో)

ఓ పారిస్ బోలిన నగరమా!
సుఖసంతోషాలకు నిలయమా!
ప్రతి ముగ్ధ- ఫ్రౌడయైన నగరము
మీకు సాటి – వేరొకటి కనము- అది సత్యము.

త్రి: (వంత పాడుతూ) ఇక్కడ పురుషులందరూ వయస్కులే!

( ఫ్రాన్సిస్, త్రిభుల నిష్క్రమింతురు)

(సశేషం)

రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 1 వ భాగం

 ఉపోద్ఘాతం:

19 వ శతాబ్దపు ఉత్తమ కవి, నవలాకారుడు, నాటక రచయితలలో  ఫ్రాన్సుకు చెందిన విక్టర్ హ్యూగో  ఒకరు.  అలెగ్జాండరు  డ్యూమాస్ కు సమకాలికుడైన హ్యూగో, తన 16వ ఏటనే అన్నదమ్ములతో రచనలు ప్రారంభించి,  ప్రాన్సులో  “రొమాంటిక్ మూవ్ మెంట్ ” కు నాయకత్వం వహించేడు.  మొదటి ప్రదర్శనలోనే  హంసపాదు  ఎదుర్కొన్న ఈ నాటకం,  మలి ప్రదర్శనకు నోచుకోలేదు.  కాని అచ్చులో ఈ నాటకం బాగా విజయవంతమయింది.

ఇది నిజ సంఘటనలు ఆధారంగా చేసుకుని వ్రాయలేదని చెప్పినా, ఇందులో  రాచరికపు వ్యవస్థలో జరిగే అకృత్యాలు కళ్ళకు కట్టినట్టు చూపించడంతో దీన్ని పూర్తిగా బహిష్కరించడమే గాక, అతనుకూడా 20 సంవత్సరాలపాటు దేశ బహిష్క్రుతుడయ్యాడు. ఈ సమయం లోనే అతని అత్యున్నత మైన రచనలు వచ్చాయి. ( please visit https://en.wikipedia.org/wiki/Le_roi_s’amuse

ఈ నాటకంలో ప్రత్యేకత  ఇందులోని హీరో. కథానాయకుడు  ఒక   సామాన్య విదూషకుడు.  హ్యూగో కల్పించిన సన్నివేశాలూ, అతని పద ప్రయోగాలూ మనసును ఆకట్టు కుంటాయి.

ఇందులో  కొన్నిపాత్రలకు ఇంగ్లీషు పేర్లకు దగ్గరగా ఉన్న తెలుగు / సంస్కృతం పేర్లు పెట్టేను.    అనువాదంలో, మూలానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ,  సౌలభ్యంకోసం అక్కడక్కడ మన అనుభూతికీ, అవగాహనకీ దగ్గరగా ఉన్నవిషయాలను  వాడడం జరిగింది.  చదువరులు క్షమింతురుగాక.

ఇంతకీ ఈ నాటకం  ఇప్పుడు ఎందుకు అనువదించవలసి వచ్చిందని అనుమానం రావచ్చును. కాలం మారుతోంది గాని, మనుషుల తత్వాలూ, అధికారo ఉన్నవాళ్ళు చెలాయించే జులుం మారలేదు. వ్యవస్థ స్వరూపాలు మారుతున్నాయి. అంతే!  మన కళ్లెదుట జరిగిన సంఘటనలే అందుకు సాక్ష్యం.  రాజులకు బదులుగా మంత్రులూ, గవర్నర్లూ, పోలీసు అధికారులూ, దేశాధ్యక్షులూ, పేరుపడ్డ క్రీడాకారులూ, ఇలా అన్నిరకాల వ్యక్తులూ ఇలాంటి పనులే చేస్తున్నారు చిన్న చిన్న తేడాలతో. ఇది సమాజపు వికృతిని సూచిస్తుంది. మనకు నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు, మనం మనం దాన్ని ముందుగా అభిశంసించాలి. ఈ అభిశంసన ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది.

అమాయకులైన ఆడపిల్లలు చదువుతో నిమిత్తంలేకుండా,  ఇప్పటికీ పై పై మెరుగులకు మోసపోతూనే ఉన్నారు. వ్యక్తిత్వాలను పరిశీలించి జీవిత భాగస్వామిని ఎంచుకునే నేర్పూ, సాహసం ప్రదర్శించలేకున్నారు. హీరోయిజం అంటే దురదృష్టవశాత్తూ ఇంకా సినిమా హీరోయిజమే  హీరోయిజంగా గుర్తిస్తున్నారు. మనకు మార్గదర్శకం కాగలిగిన నమూనాలు లేనప్పుడు, దేన్ని అనుసరించకూడదో తెలుసుకున్నా మంచిదే అన్న ఉద్దేశ్యమూ, దీని వల్ల ఒక్కరికి కనువిప్పు కలిగినా ఈ ప్రయత్నం సఫలం అన్న ఆకాంక్షా, ఎప్పుడో అనువాదం చేసినా, ఇప్పుడు దీన్ని అంతర్జాలంలో ఉంచడానికి ప్రోత్సహించాయి.

అది ప్రక్కన ఉంచితే, ఈ నాటకపు ఇతి వృత్తమూ, దానిని నడిపిన తీరూ నాకు బాగా నచ్చాయి.  మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. ఇది, 5 అంకాల నాటకం. మీ స్పందన ఇతర  ప్రముఖుల కావ్యాల అనువాదానికి ప్రోత్సాహం ఇస్తుందని ఆశిస్తున్నాను.

[ఈ రచన అనువాదానికి ప్రోత్సహించడంతో బాటు, అరుదైన ఈ నాటకం  ప్రతిని  నాకు అందించిన విశాఖ మిత్రులు శ్రీ విరియాల లక్ష్మీపతికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ]

పాత్రలు

ఫ్రాన్సిస్ — రాజు

త్రిభుల– విదూషకుడు

వేలరీ — శ్రీమతి కాశ్యప తండ్రి

గద్దే —

పెన్న–

లాతూరు —

విస్సు —

పార్థివన్ —

కాశ్యప —

బహుగుణ —

మధునిషా —

మాతంగ —

మరువీచి — కవి

సుల్తాను– వృత్తి రీత్యా  హంతకుడు

బాహుదా — త్రిభుల కుమార్తె

భద్రద —    బాహుదా సంరక్షకురాలు

మొగలి  —  సుల్తాను చెల్లెలు

శ్రీమతి కాశ్యప

రాణిగారి దగ్గర నుండి  ఒక వార్తా హరుడు  

రాజ  భటుడు

ఒక వైద్యుడు

రాజ పరివారం– స్త్రీలు– సేవకులు

————————————————————————————-

“వేలరీ”

ప్రథమాంకము — దృశ్యం 1

[తెర తీయగానే  ఒక అందమైన  భవంతి. భవనం నిండా అతి ముఖ్యులైన వ్యక్తులు, రాజ బంధువులు, అందంగా అలంకరించుకున్నవారి శ్రీమతులు, అక్కడ ఒక పెద్ద విందు జరుగుతోందని చెప్పకనే చెబుతోంది.  చక్కగా  అలంకరించిన “షాండిలేయర్స్” నుండి సన్నసన్నగా వెలుగులు జాలువారుతుంటాయి. సంగీతం– నవ్వులు —  కేరింతల మధ్య — బంగారు, వెండి, పోర్సిలిన్ కప్పులు అమర్చిన ట్రే లలో తినుబండారాలు , పానీయాలు అందించడానికి హడావుడిగా సేవకులు తిరుగుతుంటారు.  వేదికకు అటునుంచి ఇటూ , ఇటునుంచి అటూ గుంపులు గుంపులుగా అతిథులు మాట్లాడు కుంటూ వెళ్తుంటారు . కిటికీల గుండా సన్నని కిరణాలు ప్రసరించడంతో — ఆనందోత్సాహాలకు భరతవాక్యం పలుక బడుతుంది . అక్కడ ద్వార బంధాలపై , తలుపులపై, కిటికీలపై కనిపించే పనితనం , అక్కడ మేజాలు, కుర్చీలు, సోఫాలు, అక్కడకు విచ్చేసిన అతిథుల వేష ధారణా — ఇవన్నీ అన్నీ “రెనైజాన్సు ” కాలం నాటి అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి…. 

[రాజుగారు, లాతూరు ప్రవేశం]

ఫ్రాన్సిస్ : విజయాన్ని వరించే వరకూ, ఈ సాహసోపేతమైన  వేట విడిచిపెట్టలేను. ఆమె సామాన్య స్త్రీ అయితే అవుగాక! జన్మ వృత్తాంతం తెలియకపోతే తెలియకపోవుగాక!! పేరూ, సమాజంలో ఒక స్థాయీ, అన్నవి ఎరిగి ఉండకపోతే పోవచ్చుగాక!!! అయితేనేం? అంతటి అందాన్ని నేనింత వరకు చూడలేదు.
లాతూరు: అయితే ఆ నగర సుందరిని ‘హోలీ మాస్ (Holy Mass)” లో కలవబోతున్నారన్నమాట!

ఫ్రా: St. Germain des Prés. చర్చిలో@ ప్రతి ఆదివారం కలుస్తూనే ఉన్నాను.
లా: అంటే, మీరు రెండు నెలలుగా ఆమెను అనుసరిస్తున్నారన్నమాట.
ఫ్రా: అవును.
లా: ఆమె బస ఎక్కడో?
ఫ్రా: మన కాశ్యప  నివాసమూ, బుస్సీగారి డాబాకు దగ్గర. అక్కడ ఆమె బందీ.
లా: ఆ ప్రాంతం నాకు తెలుసుననే అనిపిస్తోంది. అంటే, ఆ పరిసరాలు మాత్రమే. ప్రభువులకు తెలిసినంతగా ఆ స్వర్గ ధామం  ‘లోనగరి’ గూర్చి తెలియదు.
ఫ్రా: అదిగో! ఆ పొగడ్తలే వద్దన్నది.  ప్రవేశము అందరకూ లేదు.  నిశితమైన చూపులూ, కొనదేరిన నాలుకా, పాముచెవులూ ఉన్న ఒక సంరక్షకి ఆమెను హమేషా కనిపెట్టుకుని ఉంటుంది.
లా: నిజంగా?
ఫ్రా: అంతకంటే నిగూఢమైన విషయం ఇంకొకటి ఉన్నది.  చీకటి పడగానే, మానవాకారాన్ని పోలిన ఒక గుర్తు తెలియని ఆకారం- చీకటి ముసుగులో- మరి ఏ చీకటి పనులు చెయ్యడానికోగాని, లోనికి ప్రవేశిస్తుంది.
లా: అయితే తమరూ దాన్నే అనుసరించండి.
ఫ్ర:లాభంలేదు. ఆ ఇల్లు ఇతర ప్రపంచానికి అలభ్యం.  అభేద్యం.
లా: పోనీ. ఇంత ఓపికతో వెనుకబడుతున్నారుకదా! ఆ చిన్నది, ఆ కన్నె, ప్రభువుల్ని, కన్నెత్తి అయినా చూసిందా? ఆశల ఆనవాళ్ళేమయినా గోచరిస్తున్నాయా?
ఫ్ర: చూపులు మనసుకి టిప్పణి అనుకుంటే, ఆ మంత్రించే కనులలో ద్వేషపు ఛాయలు  గోచరించడంలేదని మాత్రం చెప్పవచ్చు.
లా: పోనీ, ప్రభువులు ఆమెను ప్రేమిస్తున్నారన్న విషయం ఆమెకు విశదమేనా?
ఫ్ర: అసంభవం. సాధారణమైన వేషం లో, ఒక విద్యార్థిలా నన్ను నేను మరుగుపరుచుకున్నా.
లా: ఆహా! ఏమి ఉదాత్తమైన ప్రేమ! ఆర్పలేని అమలిన జ్వాల!
ఆమె తప్పక ఏ పూజారి ప్రేయసియో అయి ఉంటుంది.
(ఇంతలో  త్రిభుల, మరికొందరు సభికులు ప్రవేశిస్తుంటారు)
ఫ్ర: హుష్! నిశ్శబ్దం. ఎవరో వస్తున్నారు.
(త్రిభుల రాక చూసి, అతనితో)
ప్రేమలో గెలవాలనుకున్న వ్యక్తి
పెదాలను మౌనంతో అతకాలి గదూ?
త్రిభుల: పతనశీలమైన కుప్పెకు గాజు తన ఆకారం అందిస్తోంది.
అలాగే, నిర్వీర్యమైన ప్రేమను-  పేలికల వంటి తంత్రం దాచబోతోంది.
**  **  **

@ ( ఇది ఐఫిల్ టవర్ కి పశ్చిమంగా ఉంటుంది)

(ఇంకా ఉంది)

————————————————————————————

నీ జ్ఞాపకాలు…Shernaz Wadia, Indian Poet

ఇక నుండీ నన్ను వివశను చేసే నీ చిరునవ్వూ,
చూడు, అలా నవ్వితే చిన్నగా సొట్టలు పడే నీ బుగ్గలూ,
బుంగ మూతీ, కనుమరుగే కదా!

చుట్టూ ఉన్న రణగొణధ్వనిని కూడా ఛేదించుకుని,
రహస్యంగా నా చెవుల్లో నెమ్మదిగా ఊసులాడి
నా ఏకాంతపు విషాదాశ్రువులు తుడిచి నన్నూరడించే
నీ కమనీయ కంఠధ్వని, ఉహూ, ఇక ఎన్నటికీ దొరకదు కదా!!

ఇంద్రజాలం చేసే నీ కర స్పర్శ అందనంతదూరమైనా,
నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే,
చిత్రంగా నా కింకా జీవించాలన్న లాలస రగిలిస్తూనే ఉంది.
ఉద్వేగ భరితమైన నా జీవిత గమకాల్ని
అలవోకగా అర్థంచేసుకుని నన్నలరించే
నీ కన్నుల దయార్ద్ర రుచి ఇక శాశ్వతంగా మృగ్యమేకదా!!!

అన్నిటినీ మించి,ఏకాంతం నన్ను చుట్టుముట్టి
దిగులుతో మనసు పొగులుతున్నప్పుడు,
ప్రియాతి ప్రియమైన నేస్తమా! నువ్వే నా చెంత నుండవు!!!

English Original: Shernaz Wadia

కృతజ్ఞతా భావన … Shernaz Wadia, Indian Poet

ఆ మాట ఇంకా ప్రచారంలోకి రాక ముందే

ఆ అద్వితీయ భావనని మాలోకి చొప్పించారు మీరు.

తనముక్కు చాలాపొడుగ్గా ఉందని ఒకరు విచారిస్తుంటే

మీరన్నారు: “నయం!అదింకా వాసనలు పసిగట్టగలుగుతోంది.

కుష్టురోగం అక్కడఒక ఒక గొయ్యి మిగులుస్తుంది తెలుసా?” అని.

తన పాదాలు అందంగాలేవని మరొకరు తపిస్తుంటే,

మీరు అభిశంసించేరు: “సంతోషించు! నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలుగుతున్నందుకు.

ఒక వేలు పోగొట్టుకున్నవాళ్ళని అడిగిచూడు

దాని అవసరమెంతో తెలుస్తుంది.”

మూడవది తనగొంతులో కోకిలారవాలు పలకడంలేదని తపిస్తుంటే,

మీరు ఆదేశించారు : “కృతజ్ఞత కలిగి ఉండండి.

దిగమింగుకోలేని ఆ మూగ- చెముడు వేదన

మీకొక పట్టాన అర్థంకాదు.”

ప్రపంచంలో ప్రతి వస్తువు గురించీ

ఏదో ఒకదానికి మా అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాం.

అన్నిటికీ, మీ తిరుగులేని సమాధానం ఒకటే:

“పరిస్థితులు ఇంతకంటే దారుణంగా ఉండి ఉండేవి.

దేముడి కృప ఉండబట్టే ఇలా ఐనా ఉండగలుగుతున్నాం.

కృతజ్ఞత కలిగి ఉండండి.”

మొదట్లో దాన్ని ఆచరించడం చాలా కష్టంగా ఉండేది.

ఇప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత తెలిసింది,

నిజంగా మేం ఎంత అదృష్టవంతులమో!

అమ్మా! నాన్నా!! మీ ఇద్దరూ- మాకు దేముడిచ్చిన అమూల్య వరాలు!!!

English Original: Shernaz Wadia

%d bloggers like this: