అనువాదలహరి

చిరు దివ్వె … Shernaz Wadia

దివాకరుడు  రోజును వెలిగించినంత దేదీప్యంగా

నువ్వు నా జీవితాన్ని వెలిగించలేక  పోవచ్చు

కానీ,

చిరుదివ్వెలా

ఒక కాంతిపుంజాన్ని  విరజిమ్మి

మనసుని అలముకొన్న విషాదకరమైన

వెలితిని పటాపంచలు చేశావు.

 

ధ్రువనక్షత్రంలా

అచంచలమైన  నీ అనునయ సన్నిధి

ఎల్ల వేళలా

నా తప్పటడుగులని సరిదిద్దుతూ

నే పోగొట్టుకున్న నా  వ్యక్తిత్వం వైపు

నన్ను మరలిస్తూనే ఉంది.

 

నీ తీయందనపు వెలుగులు

నాలో నిబిడమైన శక్తిని వెలికితీసి

ఎ బంధనాలూ, బంధాలూ లేకుండానే

స్నేహమనే  అస్వతంత్ర స్వతంత్రంతో

నన్ను నీకు

కట్టి పడేస్తాయి.

 

English Original : Shernaz Wadia

 

 

 

 

చి’త్తరువు’ సౌందర్యం… Shernaz Wadia

ఏకాంత తరువు

విశాల వివర్ణ ప్రకృతి

నిస్సంగ నిరంబర   దేహం

అపర్ణ,   విభూతిశాఖీశాఖా

వియద్వీక్షణం

వాగామగోచర  విలాసం

వసంతాగమ నాభిలాష

అంతరాంతర  కృతజ్ఞతాంజలి .

English Original : Shernaz Wadia

కవిత ఎలా ఉండాలి ? … Shernaz Wadia

స్ఫటికం లా… అంది నిశ్చల సరస్సు మెరుస్తూ

నాలా ఉదాత్తంగా — గంభీరంగా పలికింది మహావృక్షం

నిరాఘాటం గా ప్రవహించాలి — గలగలలాడింది సెలయేరు

సద్యః స్ఫురణ కలిగిస్తూ  జీవం తొణికిసలాడాలి — కూని రాగాలు పోయింది పిట్ట

సువాసనలతో మత్తెక్కించాలి — ఝుంకరించింది తుమ్మెద

మనసు దోచుకోవాలి — నవ్వింది సీతాకోక చిలుక

రమణీయం గా ఉండాలంటేనో ? అడిగాయి పూలు

లోతుగా సారవంతంగా ఉండాలి — ఘోషించింది లోయ

కొంత రాజసం కూడా ఉండాలి — ప్రతిధ్వనించాయి కొండలు

ఆహ్లాద పరచాలి సుమా— గుసగుస లాడింది వేసవి తెమ్మెర

కరిగిపోతూ ఆలోచనలు గిలకొట్టాలి — గలగలమన్నాయి శిశిర పుటాలు

ఇకనేం అని రమణీయ ప్రకృతి నడుమ

భావావేశంతో గబగబా బరికేశాను

సగర్వంగా నా  కవిత్వాన్ని అంకితం ఇద్దామని.


ప్రకృతి ఒక్కసారి భళ్ళున పగలబడి నవ్వింది

ఓరి మూర్ఖాగ్రేసర చక్రవర్తీ !

ప్రకృతి అంతరంగాన్ని అవిష్కరించడం అంత సులువుట్రా?

శాశ్వతత్వపు  చిరు శ్వాస  అందులో ఏదిరా?


English Original : Shernaz Wadia

%d bloggers like this: